మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని మోసం

  •     బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు 
  •     నిందితుడిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  •     రూ.3 లక్షల నగదు స్వాధీనం

హనుమకొండ, వెలుగు : ప్రముఖ మెడికల్​ కాలేజీల్లో  సీట్లు ఇప్పిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న  వ్యక్తిని వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ ఏసీపీ ఎం.జితేందర్​ రెడ్డి మాట్లాడుతూ..  ఏపీలోని  తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల  గ్రామానికి చెందిన చాగంటి నాగసాయి శ్రీనివాస్​ అనే వ్యక్తి 2006 నుంచి 2014 వరకు తూర్పుగోదావరిలో  అమూల్య  ఒకేషనల్ కాలేజీ నడిపించాడు.  ఆ తర్వాత  2018 వరకు హైదరాబాద్​లోని  శ్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ లో పనిచేసి, అక్కడ  రాజేశ్​ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు.  అతడి ద్వారా  వివిధ కాలేజీల్లో  చదువుతున్న స్టూడెంట్ల వివరాలు సేకరించాడు. ఒక్కో స్టూడెంట్​ వివరాలను రూ.30 వేలకు  కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత  అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో  విశాఖపట్నంలో 2020లో వైష్ణవి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాడు. దీని ద్వారా నీట్​లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్లకు  ఏపీ, కర్ణాటకలోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు. ఈ క్రమంలోనే నిరుడు వరంగల్ కు చెందిన బరిగెల విజయ్ కుమార్ తన కూతురు ఎంబీబీఎస్​ సీటు కోసం వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో  నాగసాయి శ్రీనివాస్​తో పరిచయం ఏర్పడింది. దీంతో తాను మెడికల్  సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పగా..  విజయ్ కుమార్​ దాదాపు రూ.9 లక్షలు ఇచ్చాడు. ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన 20 నుంచి 30 మంది నుంచి రూ.కోట్లు వసూలు చేశాడు. నాగసాయి శ్రీనివాస్​  అడిగినంత డబ్బు ఇచ్చినా సీటు రాకపోవడంతో  తాము మోసపోయామని గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నాగసాయి శ్రీనివాస్​పై సైబరాబాద్​, ఖమ్మం టూ టౌన్​, ఏపీలోని బొమ్మూరు పీఎస్​, హయత్​ నగర్​, కర్నాటకలోని బెంగళూరులో కేసులు నమోదు అయ్యాయి. వరంగల్​ కు చెందిన విజయ్​ కుమార్​ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసిన పోలీసులు సీపీ రంగనాథ్​ ఆదేశాల మేరకు నిందితుడి వివరాలు కూపీ లాగారు. ఈ క్రమంలోనే ఆదివారం విజయ్ కుమార్​ వద్దకు డబ్బుల కోసం వస్తున్నాడనే పక్కా సమాచారంతో సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్​ వద్ద నాగసాయి శ్రీనివాస్​ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడు.  నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన  టాస్క్​ ఫోర్స్​ సీఐలు  కె.శ్రీనివాసరావు, ఎ. రాంబాబు, సుబేదారి సీఐ షుకూర్​,  ఎస్సైలను టాస్క్​ఫోర్స్​ ఏసీపీ జితేందర్​ రెడ్డి అభినందించారు.