ప్రీతి ఆత్మహత్యకు సైఫే కారణం

ప్రీతి ఆత్మహత్యకు సైఫే కారణం

పోలీసుల రిమాండ్‍ రిపోర్ట్​లో వెల్లడి

వరంగల్‍, వెలుగు : వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్‍ ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు సీనియర్​ సైఫే కారణమని రిమాండ్‍ రిపోర్ట్​లో వరంగల్‍ పోలీసులు వెల్లడించారు. ‘‘రిజర్వేషన్‍లో ఎంబీబీఎస్‍ ఫ్రీ సీటు వస్తే ఇట్లనే ఉంటరు” అంటూ అందరిలో కులం పేరుతో  ఆమెను అవహేళన చేశాడని పేర్కొన్నారు. ఎండీ కోర్స్ చేయడానికి అర్హత లేదన్నట్లుగా ‘‘షీ ఈజ్‍ నాట్‍ హ్యావింగ్‍ నాలెడ్జ్” అంటూ తోటి స్టూడెంట్ల ముందు అవమానపర్చాడని నివేదికలో  ప్రస్తావించారు. ‘‘తప్పుంటే డెరెక్ట్​గా చెప్పండి.. ఇలా వాట్సాప్‍ గ్రూపుల్లో పరువు తీయొద్దు” అని ప్రీతి అడిగినందుకు మరింత టార్గెట్‍ చేశాడు. ఇతర సీనియర్లు ఎలాంటి సాయం చేయకుండా తెరవెనుక కుట్ర చేశాడని రిమాండ్​ రిపోర్టులో తెలిపారు.

‘‘మాటలతో ప్రీతిని సైఫ్​ మానసిక వేధింపులకు గురి చేశాడు. డ్యూటీల మీద డ్యూటీలు వేయించి శారీరకంగా విశ్రాంతి లేకుండా చేశాడు.. తానే కోర్స్ హెచ్‍ఓడీలా ఫీల్‍ అవుతూ ర్యాగింగ్‍ చేశాడు.. రాబోయే కొన్ని రోజుల్లో డాక్టర్‍ కావాల్సిన తన జూనియర్‍ ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు” అని వివరించారు.   

ఎంజీఎంలో కులం పేరుతో అవహేళన

ప్రీతి  2022 నవంబరు 18న కేఎంసీలో పీజీ ఫస్టియర్​లో అడ్మిషన్‍ తీసుకుంది. సీనియర్‍గా సైఫ్‍..  సూపర్‍విజన్‍ పేరుతో మొదటి నుంచి ప్రీతిని వ్యక్తిగతంగా టార్గెట్‍ చేశాడు. మాటలతో అవహేళన చేశాడు. డిసెంబర్‍ నెలలో సైఫ్‍ సూపర్​ విజన్‍లో ప్రీతి ఎంజీఎం హాస్పిటల్​లో డ్యూటీలో ఉండగా.. ఉదయం 9 గంటలకు ఓ యాక్సిడెంట్‍ కేసు వచ్చింది. పేషెంట్‍కు బూగి (గైడ్‍ వైర్‍) పెట్టడం సరిగ్గా రాకపోవడంతో ప్రీతి, సైఫ్​సాయం అడిగింది. దీనిని ఆసరాగా తీసుకున్న సైఫ్‍.. తెలివి తక్కువోళ్లు రిజర్వేషన్‍ కోటాలో సీటు సంపాదించి వస్తే ఇలానే ఉంటుందని అందరి ముందు కులం పేరుతో దూషించాడు.  

వాట్సాప్​ గ్రూపుల్లో సైఫ్​ మెసేజ్​లతో.. 

ఈ ఏడాది ఫిబ్రవరి 21న హనుమకొండ జీఎంహెచ్‍లో సైఫ్‍, ప్రీతి డ్యూటీలో ఉన్నారు. ఓ పేషెంట్‍ కేసుకు సంబంధించి పీఏసీ రిపోర్ట్​ ప్రీతి సరిగ్గా రాయలేదనే విషయం సైఫ్‍ దృష్టికి వచ్చింది. ఇలాంటి సమయాల్లో మిగతా స్టూడెంట్లను పిలిచి అర్ధమయ్యేలా చెప్పే సైఫ్‍ .. ప్రీతి దగ్గరకు వచ్చేసరికి మళ్లీ టార్గెట్‍ చేశాడు. రిజర్వేషన్‍ కోటాతో పాటు ఎండీ కోర్సు చేయడానికి కావాల్సిన తెలివిలేదన్నట్లుగా 31 మందితో సీనియర్లు, జూనియర్లు ఉండే ఎల్‍డీడీ, నాకౌట్‍ వాట్సాప్‍ గ్రూపుల్లో కామెంట్లు, ఎమోజీలు పెట్టాడు. ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్​ (పీఏసీ) రాయరావడం లేదని క్రిటిసైజ్‍ చేశాడు. దీంతో  ప్రీతి సైఫ్‍కు పర్సనల్‍ మెసేజ్​పెట్టింది. తానేదైనా తప్పుచేస్తే పర్సనల్‍ గా చెప్పాలని.. లేదంటే హెచ్‍ఓడీ, జీఎంహెచ్‍ ఇన్​ చార్జ్​కు ఫిర్యాదు చేయాలి తప్పితే, ఇలా వేధించొద్దని చెప్పింది. వినకుంటే హెచ్‍ఓడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న సైఫ్‍ ప్రీతిని ఎలా వేధించాలనే దానిపై  సీనియర్‍ భార్గవ్‍తో చాటింగ్‍ చేశాడు. ఆమెకు సహకరించకుండా తోటి సీనియర్లకు మెసేజ్​లు పెట్టాడు. 

తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రికి చెప్పింది 

కేఎంసీలో చేరిన మొదటినుంచి సీనియర్‍గా సైఫ్‍ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రీతి మౌనంగా భరించింది. అదికాస్తా ఎక్కువవడంతో ఫిబ్రవరి 20న రాత్రి 08.23 గంటలకు తన తండ్రి నరేందర్‍కు చెప్పింది. నరేందర్‍ వరంగల్‍ ఏసీపీ బోనాల కిషన్‍ను తన బిడ్డ విషయంలో ప్రవర్తన మార్చుకునేలా సైఫ్‍కు కౌన్సిలింగ్‍ ఇవ్వాలని కోరారు. ఆపై ఫిబ్రవరి 21న మొత్తం విషయమై అధికారులకు లెటర్‍ రూపంలో ప్రీతి  ఫిర్యాదు చేసింది. అదేరోజు ఉదయం 11 గంటలకు హెచ్‍ఓడీ నాగార్జున రెడ్డి సైఫ్‍ను తన చాంబర్​ కు పిలిపించుకొని డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని ముందే ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. ఇద్దరూ కలిసి డ్యూటీ చేయొద్దని చెప్పారు. దీంతో సైఫ్‍ ప్రీతిపై కోపం పెంచుకున్నాడు. ప్రీతికి విశ్రాంతి లేకుండా ఉదయం పూట జీఎంహెచ్‍ డ్యూటీ అవగానే.. రాత్రి వేళ ఎంజీఎం డ్యూటీలు కూడా వేయాలని సీనియర్‍ డాక్టర్లకు సూచించాడు.

ఆ 24 వస్తువుల సేకరణ..

పోలీసులు ప్రాథమిక విచారణ చేసి సీనియర్‍ స్టూడెంట్‍ సైఫ్‍ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వెల్లడించారు. ఆపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఇందులో ఎల్‍డబ్ల్యూ01గా ప్రీతి తండ్రి నరేందర్‍ను చేర్చారు. ఎల్‍డబ్ల్యూ 02గా స్టాఫ్‍ నర్స్​ విజయలక్ష్మి, 03గా స్టూడెంట్‍ రోషి, 04గా స్టూడెంట్‍ డాక్టర్‍ బీమాని మనీష్‍,  ఎల్‍డబ్ల్యూ 05గా హెచ్‍ఓడీ కోమల్ల నాగార్జునరెడ్డి, 06గా కేఎంసీ ప్రిన్సిపల్‍ దివ్వెల మోహన్‍దాస్‍, 07గా అనస్తీషియా ప్రొఫెసర్‍ చిలక మురళీ,  08,09గా అసిస్టెంట్‍ ప్రొఫెసర్లు వొవ్విలివేణి శ్రీకళ, గోవిందుల ప్రియదర్శిణి, 10 నుంచి 18 వరకు పంచనామా చేసే టెక్నీషియన్లు , ఎల్‍డబ్ల్యూ 19గా కేసును ఇన్వెస్టిగేట్‍ చేస్తున్న వరంగల్‍ ఏసీపీ బోనాల కిషన్‍ పేరును చేర్చారు. సాక్ష్యాలను సేకరించే క్రమంలో.. ఎల్‍డీడీ అండ్‍ నాకౌట్స్​ వాట్సాప్‍ గ్రూప్‍, డాక్టర్లు గాయత్రి, వైశాలి, స్పందన, సంధ్య, రజిని, సైఫ్‍  మొబై ల్స్​ లో 27 మెసేజ్​లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 17 మెసేజ్​లు సైఫ్‍కు  సంబంధించినవిగా చూపారు. ఫిబ్రవరి 22న  ప్రీతి సూసైడ్‍ చేసుకునే సమయంలో ఆమె వద్దనున్న అనస్తీషియా టూల్‍ కిట్‍ నుంచి మొబైల్‍ చార్జర్‍, కేబుల్‍ వరకు మొత్తం 24 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.   

విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేయించి.. 

ప్రతి విషయంలో ప్రీతిని టార్గెట్‍ చేసిన సైఫ్‍.. చివరకు వేధింపుల్లో భాగంగా ఆమెకు శారీరకంగానూ విశ్రాంతి లేకుండా చేశాడు. ఫిబ్రవరి 21న హనుమకొండ గవర్నమెంట్‍ మెటర్నటీ హాస్పిటల్​లో విధులు నిర్వహించినప్పటికీ.. అదేరోజు రాత్రి మళ్లీ ఎంజీఎం హాస్పిటల్​లో డ్యూటీలు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రీతికి ఎటువంటి సాయం చేయొద్దంటూ తన క్లాస్‍మేట్‍ డాక్టర్ అనూషకు మెసేజ్​ చేశాడు. ఆర్‍ఐసీయూలో డ్యూటీ వేసి రెస్ట్​ ఇయ్యొద్దని సూచించాడు. ఈ క్రమంలోనే రాత్రంతా మానసిక ఆందోళనకు గురైన ప్రీతి ఫిబ్రవరి 22న ఉదయం ఆత్మహత్య చేసుకుంది.