
- పెరుగుతున్న యాక్సిడెంట్స్
- 2024 లో 460 ప్రమాదాల్లో 499 మంది చనిపోయిన్రు
- జనవరి నుంచి డీఎల్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసులు 35,278
- 12,552 బండ్లు పట్టుకుని, రూ.16.47 లక్షల ఫైన్లు వేసిన్రు
- మైనర్లకు బైకులిస్తే పేరెంట్స్‌పై కేసు పెడతాం: వరంగల్ సీపీ సన్‍ప్రీత్‍సింగ్
వరంగల్, వెలుగు: రాయల్ ఎన్‍ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650, టీవీఎస్ అపాచీ ఆర్‍ఆర్ 310, యమహా ఎంటీ 15 వీ2.. ఇలా మరెన్నో రకాల బుల్లెట్ బండ్లను'' రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఖర్చుచేసి కొనుగోలు చేస్తున్న యూత్ దానిని నడపడానికి అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోవడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని రింగురోడ్లపై 150 కిలోమీటర్ల స్పీడుతో బైకులు నడుతున్నవారిలో మైనర్లే అధికం. సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్దంతో రయ్యిమంటూ పరుగులు పెట్టే క్రమంలో యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. ఇలాంటి విషయాల్లో పిల్లలకు మంచిచెడు చెప్పాల్సిన తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోకుండా అడిగిన వెంటనే బైక్ తాళాలు చేతిలో పెడ్తున్నారు. దీంతో ఈ ఏడాది వరంగల్ పోలీసులు ఈ అంశంలో చర్యలకు రెడీ అయ్యారు.
రెండేళ్లలో 938 మంది మృతి..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏటేటా రోడ్డు యాక్సిడెంట్లు పెరుగుతుండగా, అంతేస్థాయిలో మరణాల రేట్లు నమోదవుతున్నాయి. 2023 లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 460 యాక్సిడెంట్లు జరిగితే, 499 మంది మృతి చెందారు. మరో 1,398 మంది వికలాంగుల మారారు. 2024లో 417 రోడ్డు ప్రమాదాలు జరగగా, 439 మంది ప్రాణాలు విడిచారు. మరో 1,395 మంది వీల్‍చైర్, చేతి కర్రలకు పరిమితమయ్యారు. ఈ లెక్కన రెండేండ్లలో యాక్సిడెంట్ల కారణంగా 938 మంది చనిపోగా, 2,793 మంది వికలాంగులుగా మారారు.
100 రోజుల్లో 35,278 లైసెన్స్ లేని కేసులు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా యూత్ ఎక్కువగా చనిపోవడం, వికలాంగుల మారడంతో దీనిపై పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారు. మైనర్లు వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ రోడ్లపైకి రావడాన్ని సహించకూడదని వరంగల్ సీపీ సన్‍ప్రీత్‍సింగ్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో జనవరి నుంచి దాదాపు 100 రోజుల్లోనే అత్యధికంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంతో 35,278 కేసులు నమోదు చేశారు. ఇందులో 63 మంది మైనర్ వాహనదారులపై కేసులు పెట్టారు. 12,552 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారా రూ.16 లక్షల 47 వేల జరిమానా వసూలు చేశారు.
మైనర్లకు బైక్ ఇస్తే పేరెంట్స్‌పై కేసులు..
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీసులు ఇకనుంచి ఈ అంశంలో సీరియస్‍గా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపితే ఊరుకునే ప్రసక్తి లేదు. డీఎల్ లేనివారికి వాహనాల యజమానులు బండ్లు ఇవ్వొద్దు. మైనర్లు బైకులు నడిపి దొరికితే న్యాయమూర్తి ఆదేశాల మేరకు అబ్జర్వేషన్ రూంకు పంపించకతప్పదు. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తాం. మైనర్లు యాక్సిడెంట్ చేసి ఎదుటి వ్యక్తి చనిపోతే, అతడికి బైక్ ఇచ్చిన యజమానికి 3 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదు. - వరంగల్ సీపీ సన్‍ప్రీత్‍సింగ్