వరంగల్​ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ..రూ.25.41 కోట్లతో అభివృద్ధి పనులు 

వరంగల్​ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ..రూ.25.41 కోట్లతో అభివృద్ధి పనులు 

కాజీపేట/ కాశీబుగ్గ, వెలుగు: అమృత్​ భారత్​ స్టేషన్​ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్​ను రూ.25.41కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే, డివిజనల్​ రైల్వే మేనేజర్​(డీఆర్ఎం) భర్తేష్​ జెయిన్​ కుమార్, వరంగల్​ రైల్వే స్టేషన్​మేనేజర్​ బలరాజు తెలిపారు. తెలంగాణలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్న 40 రైల్వేస్టేషన్లలో వరంగల్ రైల్వే స్టేషన్ ఒకటని వారు తెలిపారు.

ఈ రైల్వే స్టేషన్​ చారిత్రక నేపథ్యంలో  ప్రయాణీకులకు ఆధునిక సదుపాయాలను కల్పించాలన్న లక్ష్యంతో ఈ స్టేషన్​ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.  వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ రైల్వే స్టేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. ఈ స్టేషన్ నిర్మాణం కాకతీయ వాస్తుశిల్పకళను ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. కాజీపేట-విజయవాడ సెక్షన్‌లోనున్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలందిస్తోంది.

ఇక్కడ దాదాపు 137 రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు. స్టేషన్ న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్ మరియు తిరుపతి వంటి అనేక రూట్లలో సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నారని చెప్పారు. స్టేషన్ భవనానికి ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాన్ని నిర్మించాని, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు,  ప్లాట్​ఫారాలను ఆధునీకరిస్తున్నారని వివరించారు.

వెయిటింగ్ హాల్‌ నిర్మాణం, స్టేషను ఆవరణలో ఆహ్లాద పరిచే ల్యాండ్​స్కేప్, కాకతీయుల నాటి  కళలు, సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 50 శాతం పనులు పూర్తయ్యాయని, మరో ఆరు నెలల్లో స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.