హనుమకొండ, వరంగల్, వెలుగు: బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఓరుగల్లు నగరం జనసంద్రమైంది. శనివారం బండి సంజయ్ పాదయాత్ర హనుమకొండలో ముగియగా.. ఆదివాసీ గుస్సాడీ నృత్యాలు, ఆడపడుచుల కోలాటాలు, బోనాలు, బతుకమ్మ ఆటపాటలతో ఆయనకు స్వాగతం పలికారు. సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ముగింపు సభ నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. ముగింపు సభకు వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయింది.
భద్రకాళి ఆలయంలో బీజేపీ అగ్రనేతల పూజలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా, బండి సంజయ్ తో కలిసి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంట్లో కేయూ ప్రొఫెసర్లతో భేటీ అయి బహిరంగ సభకు చేరుకున్నారు.
ఏసీపీపై ప్రదీప్ రావు ఆగ్రహం..
పాదయాత్రలో ఏసీపీ గిరికుమార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. వరంగల్ బట్టల బజార్ బ్రిడ్జి వైపు అనుమతి లేదని ఏసీపీ అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎర్రబెల్లి ప్రదీప్ రావును బలవంతంగా గెంటే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన అనుచరులు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ప్రదీప్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గులాబీల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నయ్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించగానే.. గులాబీ లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పాదయాత్రలో టీఆర్ఎస్ లీడర్లు రౌడీల్లా వ్యవహరించి, శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని చూశారు. కానీ ప్రజలు తెగువను ప్రదర్శించి బీజేపీ అండగా నిలిచారు. చివరకు బహిరంగ సభను సైతం అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్‌కు బుద్ధి రాలేదు. కోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. ఇక నుంచి తాడోపేడో తేల్చుకోవడమే, దొర గడీలు కూలగొట్టుడే..
- ఏ.రాకేశ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
బీజేపీతోనే అభివృద్ధి ..
టీఆర్ఎస్ లీడర్లు అక్రమాలకు పాల్పడటం తప్ప రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. వరంగల్ నగర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ లాంటి పథకాలు ఇస్తే.. ఆయా పథకాల నిధులన్నింటినీ కేసీఆర్ పక్కదారి పట్టించారు. రాష్ట్రంలో అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో రహదారులను డెవలప్ చేస్తోంది. రూ.150 కోట్లతో వరంగల్‌కు కేంద్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేస్తోంది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ సర్కారును కూలగొట్టుడు ఖాయం.
- రావు పద్మ, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు