వరంగల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఆటో డ్రైవర్8 మంది ప్రయాణికులతో వెళ్తున్నాడు.
ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మిగతా వారంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.