కాంగ్రెస్‍కు వరంగల్ సెంటిమెంట్.. అభివృద్ధిలోనూ వరంగల్ జిల్లాపై ఫోకస్‍

కాంగ్రెస్‍కు వరంగల్ సెంటిమెంట్.. అభివృద్ధిలోనూ వరంగల్ జిల్లాపై ఫోకస్‍

వరంగల్‍, వెలుగు: కాంగ్రెస్‍ ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్రనేతల దాకా ఓరుగల్లును సెంటిమెంట్‍గా తీసుకున్నారు. పార్టీ సభలైనా.. ఎన్నికల ప్రచార మీటింగులైనా ఉమ్మడి వరంగల్‍ను నుంచే ప్లాన్‍ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్‍ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరైన సభలను ఇక్కడే నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడ గానే.. ఇచ్చిన హామీలను ఇక్కడి సభ వేదికలపై నుంచే అమలును ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది రాష్ట్ర పాలనను ప్రొగ్రెస్‍ కార్డులా భావిస్తూ విజయోత్సవ సభను కూడా వరంగల్ నుంచే నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో పార్టీకైనా, రాష్ట్ర ప్రభుత్వానికైనా ఓరుగల్లు సెంటిమెంట్‍గా మారింది.

ఇక్కడ్నించే రైతు డిక్లరేషన్ ప్రకటన
రాష్ట్రంలో కాంగ్రెస్‍ అధికారంలోకి రావడమే లక్ష్యంగా 2022 మే 6న వరంగల్ లో రైతు సంఘర్షణ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్‍ ప్రకటించింది. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సభకు కాంగ్రెస్‍ అధినేత రాహుల్‍ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాము అధికారం లోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చుతామన్నారు. మళ్లీ రాహుల్ 2023 నవంబర్‍17న నర్సంపేట కాంగ్రెస్‍ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ అభ్యర్థులు కొండా సురేఖ, నాయిని రాజేందర్‍రెడ్డి తరఫున ప్రచారం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఓటర్లను ఆకట్టుకున్నారు.  అన్నట్టుగానే  2023 అసెంబ్లీ ఎన్నికల పార్టీ ప్రణాళికలోనూ పొందుపరిచారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం రాగానే చెప్పినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేశారు. మళ్లీ ఆగస్టులో కృతజ్ఞత సభ నిర్వహించాలని ప్లాన్ చేసినా వాయిదా పడింది. ఇప్పుడు ఏడాది పాలన విజయోత్సవ సభను వరంగల్ కేంద్రంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

2008లో సోనియాగాంధీ మీటింగ్‍ 
ఉమ్మడి ఏపీ పాలనలో సోనియా గాంధీ వరంగల్‍ జిల్లాలో పర్యటించారు. 2008లో దేవాదుల ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. బీసీలకు మద్దతు తెలిపే మీటింగ్ లోనూ పాల్గొన్నారు. అనంతరం 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్‍గా భావిస్తూ పార్టీ అగ్రనేతలు  ఓరుగల్లుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ అనుకూలంగా నిర్ణయం తీసుకు న్న నేపథ్యంలో 2013లో వరంగల్‍ లో కృతజ్ఞత సభ నిర్వహించాలని భావించినా కుదరలేదు.

ఏడాది పాలన విజయోత్సవాలు
 కాంగ్రెస్‍  ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వివరించేందుకు పార్టీ నేత లు రెడీ అయ్యారు. ఇందుకు ఈనెల 19న ఓరుగల్లులో విజయోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా రు. ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రొగ్రెస్‍ కార్డు రూపంలో ప్రజల ముందు పెట్టనున్నట్లు నేతలు తెలిపారు. మొత్తం గా ఏడాది పాలన విజయోత్సవానికి ఓరుగల్లునే వేదికగా చేసుకోవడం కూడా విశేషం. రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ కాలేజీనే విజయోత్సవ సభకు వేదిక కానుంది.

 ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకం
పదేండ్ల కేసీఆర్‍ పాలనను కాదని తెలంగాణలో కాంగ్రెస్‍ అధికారంలోకి రావడంలో ఓరుగల్లు కీలకమైంది. బీఆర్‍ఎస్‍ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా హేమహేమీ లీడర్లు బరిలో నిలిచినా.. కాంగ్రెస్ వైపే ఓటర్లు అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 10 సీట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారు. వార్‍ వన్‍ సైడ్‍ అన్నట్లుగా ఘన విజయం సాధించారు. ఆపై కడియం శ్రీహరి సైతం హస్తం గూటికి చేరారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వరంగల్‍ (ఎస్సీ) , మహబూబాబాద్‍ (ఎస్టీ) స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కడియం కావ్య, బలరాం నాయక్‍ విజయం సాధించారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్లకు రెండింటిని దక్కించుకున్నారు.