వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలి

వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలి
  •     వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాలి
  •     6 వేల కోట్ల నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు
  •      ఫోరం ఫర్ బెటర్ వరంగల్ మేధావుల సభ్యులు

హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి, రెండో రాజధానిగా ప్రకటించాలని ‘ఫోరం ఫర్ బెటర్ వరంగల్’ సభ్యులు డిమాండ్ చేశారు.  గత పాలకులు ఉమ్మడి జిల్లాను విభజించి చారిత్రక, వారసత్వ అస్తిత్వాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. శనివారం హనుమకొండ హరిత హోటల్ లో  నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. 

ఉమ్మడి  జిల్లా విభజనతో రాజకీయ, చారిత్రక అస్తిత్వాన్ని కోల్పోయిందని రాష్ట్ర బార్ కౌన్సిల్ రిటైర్డ్ మెంబర్ ముద్దసాని సహోదర్ రెడ్డి అన్నారు. వరంగల్ పేరు శతాబ్దాల తరబడి వారసత్వ చిహ్నమని, భవిష్యత్ లోనూ దానిని పరక్షించుకోవాలని కేయూ రిటైర్డు ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సదానందం పేర్కొన్నారు. 

 రెండు ప్రాంతాలను కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని మాజీ మేయర్ టి. రాజేశ్వర్ రావు అన్నారు. వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ పై అవగాహన కల్పించాలని, భూగర్భ డ్రైనేజీ, మామునూరు ఎయిర్ పోర్టు,కాజీపేట జంక్షన్​ ,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులను త్వరగా  పూర్తి చేయాలని,  వరంగల్ జిల్లా అభివృద్ధికి రూ. 6 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. 

ఆజంజాహి మిల్లు భూముల దురాక్రమణపై రిటైర్డు జడ్జితో విచారణకు కమిటీని,  చెరువులు, కుంటల పరిరక్షణకు హైడ్రా తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని  కోరారు. సమావేశానికి సంఘం అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ సమన్వయం చేశారు.  సీనియర్ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు విజయబాబు, రామిరెడ్డి, సారంగపాణి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.