రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1539 బ్యాలెట్ బాక్సులలో 1307 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్ హాల్ లోకి అనుమతించనున్నారు. సాయంత్రం 6 గంటలలోపు లెక్కింపు పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. విజయోత్సవ ర్యాలీలు, సభలకు అనుమతి లేదు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి కౌంటింగ్ హాల్ లో 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. హాల్లో 50 మంది కంటే ఎక్కువ ఉండొద్దని ఆదేశించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ జరిగింది. వరంగల్ కార్పొరేషన్ లో మొత్తం 502 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. రాంపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కౌంటింగ్ జరుగుతోంది. స్కూల్ లోని మూడు బ్లాకుల్లో డివిజన్ల వారీగా లెక్కింపు జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు తరలించి స్ర్టాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 19వందల మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపులో మొత్తం 150 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ కు రెండు హాళ్లు, 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ రౌండ్ లో 1 నుంచి 12 వార్డులు, రెండో హాల్లో 13 నుంచి 21వ వార్డుల ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో రౌండ్ లో మొదటి హాల్లో 22 నుంచి 33 వ వార్డు వరకు, రెండో హాల్లో 34వ వార్డు నుంచి 43వ వార్డు వరకు ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ కు 2 గంటలకు పైగా టైమ్ పట్టే చాన్సుంది.
ఎన్నికల కౌంటింగ్ కు వచ్చే సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో కరోనా టెస్టులు చేశారు. నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్లలోకి అనుమతించారు. మరోవైపు సిద్దిపేట మున్సిపాల్టీలో మొత్తం లక్షా 658 మంది ఓటర్లుంటే..67 వేల 539 మంది మాత్రమే పోలింగ్ కు పాల్గొన్నారు. ఇక గజ్వేల్ మున్సిపాల్టీలోని 12 వ వార్డుకు జరిగిన బై పోల్ ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ముందుగా పోస్టర్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు సిబ్బంది. SR అండ్ BGNR కాలేజీలో కౌంటింగ్ నడుస్తోంది. మొత్తం 59 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్.... ఆరు రౌండ్లలో పూర్తి కానుంది. మొదటి 5 రౌండ్లలో 50 డివిజన్ల ఫలితాలు వస్తాయి. చివరి రౌండ్ లో మిగతా 9 డివిజన్ల రిజల్ట్స్ రానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. ఇప్పటికే పోలింగ్ విధుల్లో పాల్గొన్న 247 మందికి పాజిటివ్ వచ్చింది.
ఖమ్మం కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లున్నాయి. ఇందులో ఒకటి ఏగగ్రీవం కాగా.. మిగిలిన 59 డివిజన్ల నుంచి 251 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో TRS, CPI లు కలిసి పోటీ చేశాయి. టీఆర్ఎస్ 57 డివిజన్లలో పోటీ చేయగా.... సీపీఐ 3 స్థానాల్లో పోటీకి దిగింది. కాంగ్రెస్ 47 స్థానాల నుంచి బరిలోకి దిగింది. టీడీపీ 8 స్థానాల్లో పోటీ చేసింది. సీపీఎం 10 డివిజన్ల నుంచి పోటీకి దిగింది. జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేయగా.... జనసేన 5 డివిజన్లలో బరిలోకి దిగింది. ఇండిపెండెంట్లు 70 మంది పోటీ చేశారు.
నకిరేకల్ మున్సిపల్ లో 20 వార్డులు ఉండగా.. 93 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నకిరేకల్ లో 86.15 శాతం పోలింగ్ నమోదైంది. నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మూడు హాళ్లలో 12 టేబుళ్ల చొప్పున కౌంటింగ్ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ కొనసాగుతోంది