263 కిలోల గంజాయి స్వాధీనం

263 కిలోల గంజాయి స్వాధీనం

హనుమకొండ/వరంగల్‌‌‌‌/నర్సంపేట, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, నర్సంపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. వరంగల్‌‌‌‌ సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా శనివారం కమిషనరేట్‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా గొర్లవీడు తండాకు చెందిన బానోతు బాబుకుమారస్వామి, నేరేడుపల్లికి చెందిన నస్పూరి కుమారస్వామి ఇద్దరూ కారు డ్రైవర్లుగా పనిచేసేవారు.

దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరికి మహబూబాబాద్‌‌‌‌కు చెందిన జలేందర్‌‌‌‌, భూపాలపల్లికి చెందిన అంగోతు రాజేందర్‌‌‌‌ పరిచయమయ్యారు. వీళ్లంతా కలిసి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా డొంకరాయికి చెందిన ముకుంద్‌‌‌‌ వద్ద 256 కిలోల ఎండు గంజాయిని కొన్నారు. దానిని రెండు కిలోల చొప్పున 128 ప్యాకెట్లుగా మార్చి బాబు కుమారస్వామి, కుమారస్వామి ఇద్దరూ కారులో డొంకరాయి నుంచి భద్రాచలం, మహబూబాబాద్‌‌‌‌ మీదుగా నర్సంపేటకు వస్తున్నారు.

గంజాయి తరలిస్తున్న సమాచారం వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు తెలియడంతో శనివారం ఉదయం నర్సంపేట పోలీసులతో కలిసి కమలాపూర్‌‌‌‌ క్రాస్‌‌‌‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అటు వైపు వచ్చిన బాబు, కుమారస్వామి పోలీసులను చూపి తప్పించుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 64 లక్షల విలువైన 256 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, మూడు సెల్‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంగోతు రాజేందర్, జలంధర్‌‌‌‌, ముకుంద్‌‌‌‌ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఏసీపీ మధుసూదన్‌‌‌‌, నర్సంపేట ఏసీపీ కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌, సీఐలు సార్ల రాజు, రమణమూర్తి, ఎస్సైలు శరత్‌‌‌‌కుమార్‌‌‌‌, భాను ప్రకాశ్‌‌‌‌, రఘుపతిని సీపీ అభినందించారు.

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో 7.1 కిలోలు..

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : రైలులో హైదరాబాద్‌‌‌‌కు తరలిస్తున్న గంజాయిని జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని థానే జిల్లా బదలాపూర్‌‌‌‌ మండలం కతోడ్‌‌‌‌వాడీ గ్రామానికి చెందిన మనోహర్‌‌‌‌ భగవాన్‌‌‌‌ సావర్‌‌‌‌ డెకరేషన్‌‌‌‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. జల్సాలకు బానిసైన అతడు డబ్బు కోసం గంజాయి దందా ప్రారంభించాడు.

ఇందులో భాగంగా రెండు రోజుల కింద ఏపీలోని తునికి చెందిన సుమన్‌‌‌‌ వద్ద గంజాయి కొని అక్కడి నుంచి రైలులో కాజీపేటకు చేరుకున్నాడు. అక్కడ దానిని అమ్మేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో గోల్కొండ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ రైలులో హైదరాబాద్‌‌‌‌ బయలుదేరాడు. రైలులో జీఆర్‌‌‌‌పీ పోలీసులు కనిపించడంతో స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో దిగాడు.

స్టేషన్‌‌‌‌ బయట సీఐ ముసికె రాజు, ఎస్సై వినయ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మనోహర్‌‌‌‌ భగవాన్‌‌‌‌ సావర్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా విషయం బయటపడింది. అతడి వద్ద నుంచి రూ 1,77,500 విలువైన 7.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అతడిని అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు పంపినట్లు డీసీపీ చెప్పారు.