నిందితులు ఏపీ శ్రీకాకుళంకు చెందిన వారిగా గుర్తింపు
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ కాల్ లెటర్లతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకు చెందిన సలాడి రామ్ గోపాల్, అంకాల సుభాష్, ధర్మవరం ప్రసాద్, రజనిగా గుర్తించారు. ఈ గ్యాంగ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయుష్మాన్ పథకం స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి మరీ నిరుద్యోగులకు వల వేస్తున్నారు.
పత్రికల్లో ప్రకటనలు చూసి ఆకర్షితులైన వారిని నిందులు గుర్తించి.. మీకే ఉద్యోగం కావాలంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుందని.. దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని డబ్బులు గుంజుతారు. తమ ప్రకటనలకు ఆకర్షితులైన ఆశావహుల నుంచి అందినకాడికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే గ్యాంగ్ చివరగా ఫేక్ కాల్ లెటర్లు చేతిలో పెట్టి మోసం చేస్తున్నారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు రాంగోపాల్ పాత నేరస్తుడేనని గుర్తించారు. ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులున్నాయని.. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పీడీ చట్టం కింద నమోదైన కేసులో జైలు జీవితం గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్టు చేసిన గ్యాంగ్ నుంచి నగదుతోపాటు ఫేక్ కాల్ లెటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.