వరంగల్ జిల్లాలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్​ల దందా

వరంగల్ జిల్లాలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్​ల దందా

హనుమకొండ, వెలుగు: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ ల దందా చేస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి వివిధ బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న రూ.28.6లక్షల విలువైన నకిలీ వైర్లు, స్విచ్​లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ అండర్ బ్రిడ్జి ఏరియా శివనగర్ కు చెందిన చౌదరి ధనరావు కొంతకాలంగా శ్రీపార్వతి ఎలక్ట్రికల్స్ పేరున భవన నిర్మాణ రంగంలో వాడే ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ ల బిజినెస్ చేస్తున్నాడు.

పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ వైర్లు, స్విచ్​లు అమ్ముతున్నాడు. వరంగల్ టాస్క్​ఫోర్స్ పోలీసులకు సమాచారం అందగా, మంగళవారం సాయంత్రం షాప్​లో తనిఖీలు నిర్వహించి, వస్తువులను పరిశీలించి, విచారించారు. దీంతో ఆయన అసలు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం షాప్​ లో ఉన్న రూ.28,67,762 విలువైన వివిధ బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ వైర్లు, స్విచ్ లను గుర్తించి సీజ్​ చేశారు. విచారణ నిమిత్తం నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని మిల్స్ కాలనీ పోలసులకు అప్పగించారు.