ఇండ్ల నిండా బురద.. వరంగల్​లో ఆగమాగం

  • 170 కాలనీల్లో ఇదే పరిస్థితి.. నాలుగు రోజుల తర్వాత ఇండ్లకు చేరుకుంటున్న ప్రజలు
  • బుధవారం నుంచి నిలిచిన కరెంట్ సరఫరా
  • పట్టించుకోని అధికారులు.. ఫైర్ అవుతున్న పబ్లిక్

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్​లోని కాలనీల్లోకి నడుం లోతు వరకు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లన్నీ నీట మునిగాయి. వరద ప్రవాహం తగ్గడంతో శుక్రవారం ఇండ్లకు వెళ్లి తాళాలు తీసి చూడగా.. మొత్తం బురద పేరుకుపోయి కనిపించింది. బియ్యం, పప్పులు, బట్టలు, మంచాలు పనికిరాకుండా పోయాయి. 

వరంగల్, హనుమకొండలోని చాలా కాలనీలకు మూడు రోజులుగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకున్న లీడర్లు.. ఇప్పుడు ఎక్కడ పోయారంటూ కాలనీవాసులు మండిపడుతున్నారు.

170 కాలనీల్లో.. ఏ ఇల్లు చూసినా బురదే..

గ్రేటర్ వరంగల్‍ సిటీ 407 చదరపు కిలో మీటర్లలో మేర విస్తరించి ఉండగా.. 66 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 2 .25 లక్షల ఇండ్లల్లో 11 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ట్రై సిటీగా పిలిచే వరంగల్‍, హనుమకొండ, కాజీపేటలో 92 నోటిఫైడ్‍, 91 నాన్‍ నోటిఫైడ్‍ స్లమ్‍ ఏరియాలున్నాయి. 2020, ఆగస్ట్ 15న కురిసిన భారీ వర్షాలకు 120 నుంచి 130 కాలనీలు నీట మునిగాయి. ఇప్పుడు 183 కాలనీలతో పాటు ఈ జాబితాలోని లేని మరో 20 నుంచి 25 కాలనీల్లోని ఇండ్లలోకి వరద పోటెత్తింది. ఇందులో దాదాపు 150 నుంచి 170 కాలనీల్లోని ఇండ్లు బురదతో నిండిపోయాయి. 

ఫోన్ లిఫ్ట్ చేయని అధికారులు

గ్రేటర్ వరంగల్​లో బుధవారం నుంచి కరెంట్ సప్లై లేదు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, కొందరు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. హనుమకొండ పెగడపల్లి డబ్బాలు, సుందరయ్య నగర్‍, ఎల్‍.వెంకట్రామయ్య కాలనీ, గుండ్లసింగారం, ఇందిరమ్మకాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, పలివేల్పుల, ఎస్టీ తండా, హనుమాన్‍ నగర్‍లోని 4 కాలనీలు, పోచమ్మకుంట, విద్యారణ్యపురి, నయీంనగర్, కిషన్‍పుర కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. అధికారుల సూచన మేరకు చాలా కాలనీల్లోని జనాలు సోమవారమే ఇండ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వానలు తగ్గడంతో శుక్రవారం ఇండ్లకు చేరుకున్నారు. తాళాలు తీసి చూడగా.. ఇల్లంత బురదతో నిండిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇల్లు వాష్ చేసుకుందామన్నా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే..

వరద నీళ్ల కారణంగా చాలా ఇండ్లు మునిగిపోయాయి. వస్తువులన్నీ తడిసిపోయాయి. బియ్యం, ఉప్పులు పప్పులన్నీ కరాబ్​ అయినయ్. మూడు రోజులుగా తిండికి ఇబ్బంది పడుతున్నం. ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. కార్పొరేటర్ ఫోన్ స్విచ్ఛాఫ్​ చేసుకున్నడు. పేషెంట్లు ఉన్నారని టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే.. వివరాలడిగి తెలుసుకున్నరు. మళ్లీ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే.
– గుమ్మడి రాజ్ అక్షయ, బీఆర్ నగర్, వరంగల్