- రైతు వేదిక కోసం ఇల్లు కూల్చారని ఆవేదన
- కలెక్టర్ కాళ్ల మీద పడబోయిన వృద్ధ దంపతులు
కమలాపూర్, వెలుగు: ‘ఉండేందుకు గూడు లేదని 40 ఏండ్ల కింద గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకున్నం. రైతువేదిక కోసమని ఉన్న ఇల్లు కూలగొట్టిన్రు. ఇప్పుడు మేం ఏడికి పోవాలె. ఉండేందుకు ఏమీ లేదు. ఈడనే ఉంటాం. బాంచన్ కాల్మొక్త మీరే న్యాయం చేయాలె’ అంటూ కలెక్టర్ ను వేడుకున్నారు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన వృద్ధ దంపతులు. గూడూర్ గ్రామానికి చెందిన మణిగట్టు సారమ్మ, సమ్మయ్య దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద కుటుంబం.. ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో దాదాపు 40 ఏండ్ల కిందట గ్రామ దొర సూచన మేరకు ఊరి శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో పూరి గుడిసె వేసుకున్నారు. 13 ఏళ్ల క్రితం సుమారు 50 గజాల విస్తీర్ణంలో చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రైతు వేదిక భవన నిర్మాణం కోసం నెలరోజుల కిందట ఆ ఇంటిలో కొంత భాగాన్ని కూల్చేశారు. దీంతో నిలువ నీడ కోసం తాపత్రయ పడ్డ వృద్ధ దంపతులతో స్థానిక లీడర్లు అక్కడే వేరేచోట ఇల్లు కట్టుకొమ్మని చెప్పారు. సారమ్మ ఒంటిమీద ఉన్న బంగారం కుదువ పెట్టి తెచ్చిన సుమారు రూ. 30 వేలతో సిమెంట్ ఇటుకలను కొనుగోలు చేసి పునాది పనులు ప్రారంభించారు. లీడర్లు, కాంట్రాక్టర్అడ్డుపడి ఇక్కడ కాదు.. కొంచెం దూరాన కట్టుకోమని పునాదులు తొలగించడంతో వేల రూపాయల నష్టం వాటిల్లింది. శుక్రవారం గ్రామంలో రైతు వేదిక పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఎదుట బాధితులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ఇంటిని కూల్చిండ్రు.. వేరే చోటుకు వెళ్లం, ఇక్కడే ఉంటం. మాకు మీరే న్యాయం చేయాలె’ అని కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఆఫీసర్లు, కాంట్రాక్టర్ వేరే స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెబుతున్నారు కానీ ఎన్నిసార్లు వారి చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆఫీసర్లతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.