- పోటాపోటీగా డివిజన్లలో తిరుగుతున్న నాయిని, జంగా
- కర్రలు, రాళ్లతో దాడులకు దిగుతున్న ఇరువర్గాలు
- ఐదు రోజుల్లోనే మూడు చోట్ల కొట్లాటలు
- జంగా రాఘవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
వరంగల్, వెలుగు : వరంగల్ పశ్చిమ కాంగ్రెస్‌లో టికెట్ లొల్లి మాటలు దాటి దాడులు, కేసుల వరకు చేరుకుంది. ఈ టిక్కెట్ కోసం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ సారి టికెట్ నాదే అంటే నాదే అంటూ ఏడాది నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పాటు పోటాపోటీగా డివిజన్లలో తిరుగుతున్నారు. హైకమాండ్‌కు తమ బలాన్ని చూపెట్టాలన్న ఉద్దేశంతో సొంత పార్టీలోనే ఒకరి అనుచరులను మరొకరు తమ టీంలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వరుసగా కర్రలు, రాళ్లతో దాడులకు దిగుతున్నారు.
ఐదు రోజుల్లో మూడు చోట్ల ఫైటింగ్
జంగా రాఘవరెడ్డి వర్గీయులు ఈ నెల 5న హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ ఏరియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నాయిని రాజేందర్‍రెడ్డి అనుచరులు, జంగా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అదికాస్తా కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు ఇలా రోడ్లపై పడి బాహాబాహికి దిగడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జరిగిన రెండో రోజే కాజీపేట సోమిడి ప్రాంతంలో మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు కూడా బాబు క్యాంపు ఏరియాలోనూ నాయిని, జంగా అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
జంగాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కాంగ్రెస్ లీడర్ జంగా రాఘవరెడ్డిపై అదే పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు అంబేడ్కర్ రాజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. జంగా వర్గీయులు ప్రచారం పేరుతో తమ ప్రాంతానికి వచ్చి కులం పేరుతో దూషించడమే కాకుండా దాడులు సైతం చేశారని హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు జంగాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అదే సమయంలో తమ అనుచరులైన ఎస్సీ సేవాదళ్ నాయకుడు అశోక్, మహిళా నేతలు కత్తుల కవిత, రేణుకలపై నాయిని అనుచరులు దాడులు చేశారని జంగా టీం సైతం కేసులు పెట్టింది.
ALSO READ: సాగర్ బీఆర్ఎస్లో హీటెక్కుతున్న రాజకీయం
అయితే నాయిని ప్రోద్భలంతోనే ఆయన అనుచరుడు రాజు తమపై కావాలనే తప్పుడు కేసు పెట్టించాడని రాఘవరెడ్డి ఆరోపించారు. తాము ఇతర పార్టీలకు సపోర్ట్ చేయడం లేదని, కాంగ్రెస్ తరఫునే ప్రచారం చేస్తే అడ్డుకోవడమే కాకుండా, తమపైనే కేసులు పెట్టించడం సరికాదని జంగా వర్గీయులు మండి పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలోనే కాంగ్రెస్ క్యాండిడేట్‌ను కూడా ప్రకటించే చాన్స్ ఉంది. ఈ లోపే ఇరువర్గాలు దాడులు చేసుకోవడం, కేసుల వరకు వెళ్లడం ఎటు వైపు దారితీస్తుందోననే క్యాడర్‌లో ఆందోళన నెలకొంది.