బీఆర్​ఎప్​ ఆఫీస్ ​నిర్మాణానికి అనుమతుల్లేవ్​

బీఆర్​ఎప్​ ఆఫీస్ ​నిర్మాణానికి అనుమతుల్లేవ్​
  •     కబ్జా చేసి కట్టిన బిల్డింగ్​ ఖాళీ చేసిపోవాలే..
  •     ప్రెస్‍క్లబ్‍ వెనకాల స్థలమిస్తే.. పార్క్​ స్థలం కబ్జా చేసిన్రు
  •     మీడియా సాక్షిగా డాక్యుమెంట్లతో నేను రెడీ.. మీరు రావాలే 
  •     ప్రెస్‍మీట్​లో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: భూకేటాయింపు, ఆఫీస్​ నిర్మాణానికి అనుమతి పత్రాలు లేవని, బీఆర్‍ఎస్‍ లీడర్లు హనుమకొండ బాలసముద్రంలోని పార్క్​ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆఫీస్‍ను గౌరవప్రదంగా ఖాళీ చేసి వెళ్లాలని, వినకుంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన డీసీసీ భవన్​లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ నిర్మాణంపై అధికారులు ఆర్టీఐ కింద ఇచ్చిన పలు డాక్యుమెంట్లను చూపుతూ మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం మిగతా జిల్లాల్లో మాదిరి బీఆర్‍ఎస్‍ పార్టీకి ఆఫీస్‍ కోసం హనుమకొండ ప్రెస్‍క్లబ్‍ వెనకాల ఎకరం స్థలం కేటాయించిందని తెలిపారు. కానీ, అప్పటి ఎమ్మెల్యే వినయ్‍ భాస్కర్‍ అదే సర్వే నంబర్‍తో బాలసముద్రం కాలనీలకు చెందిన పార్కు స్థలంలో సుప్రీంకోర్టు​ తీర్పునకు విరుద్ధంగా అక్రమంగా ఆఫీస్‍ నిర్మాణం చేశాడన్నారు. అంతేగాక ఎకరమని చెప్పి, మరో 8 నుంచి 10 గుంటలు ఎక్కువ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ఆఫీస్‍ కోసం అధికారులు స్థలం ఇస్తున్నట్లు ఎటువంటి భూకేటాయింపు పత్రాలుగానీ, ఆఫీస్‍ నిర్మాణానికి పర్మిషన్లు గానీ లేవన్నారు. 

అయినా ఇష్టారీతిన గజం రూ.లక్ష పలికే ఎకరం స్థలం కబ్జా చేశారని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్లు ముగిశాక మరింత భూమి కబ్జా చేసినట్లు తెలిపారు. ఇంటినంబర్‍ లేకుండా కరెంట్‍ మీటర్‍ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా, విద్యుత్తు శాఖలో వారికి సంబంధించిన అధికారులతో కరెంట్‍ మీటర్​తోపాటు ఏకంగా జంక్షన్‍ లైటింగ్‍ పెట్టుకున్నారన్నారు. చీఫ్‍విప్‍ స్థాయిలో ఉండి మూన్నాలుగేండ్లుగా ట్యాక్స్​కట్టకుండా ఉంటే, అప్పటి మున్సిపల్‍ మంత్రిగా కేటీఆర్‍ దానిని ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఆఫీస్‍ కబ్జా అక్రమాలపై మీడియా సాక్షిగా అధికారిక డాక్యుమెంట్లతో వస్తానని, వినయ్‍ భాస్కర్‍ సైతం తనవద్ద ఉన్న డాక్యుమెంట్లతో ఓపెన్‍ డిబేట్‍కు రావాలని సవాల్‍ విసిరారు. 

హైదరాబాద్‍ గాంధీ భవన్‍, హనుమకొండ డీసీసీ భవన్‍లు ట్రస్ట్​లకు సంబంధించిన నిర్మాణాలు తప్పితే, కాంగ్రెస్‍ పార్టీలకు ఇచ్చిన ఆస్తులు కాదన్నారు. అదికూడా తెలియకుండా మాట్లాడటం మాజీ ఎమ్మెల్యేల తెలివితక్కువతనమని ఎద్దేవా చేశారు.  బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీస్‍ పార్క్​ స్థలంలో ఉన్నట్లు తనకు కేటాయించిన క్యాంప్‍ ఆఫీస్‍ సైతం అదే స్థలంలో ఉంటే తట్టాబుట్టా సర్ధుకుని దానిని ఖాళీచేసి వెళ్తానని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫీస్‍ ఉంటే దానిని కూల్చేలా ఆఫీస్‍ ముందుకొచ్చి కూర్చుంటానని అన్నారు. 

ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్‍ చేసిన కబ్జాలు చెప్పుకుంటూపోతే తన టర్మ్​ముగుస్తుందని ఎద్దేవా చేశారు. అవసరమైతే రాజకీయాలు వదిలేస్తాను తప్పితే, మీరు చేసిన పాపాలను వదలను అని హెచ్చరించారు. సమావేశంలో మాజీ మేయర్‍ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్‍ అజీజ్‍ఖాన్‍, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్‍, తోట వెంకటేశ్వర్లు, సయ్యద్‍ విజయశ్రీ రజాలీ, గుంటి శ్రీనివాస్‍, మానస రాంప్రసాద్‍, చీకటి శారద ఆనంద్‍, నేతలు కూచన రవళి, నమిండ్ల శ్రీనివాస్‍ తదితరులు 
పాల్గొన్నారు. 

ఆఫీస్‍ పేరుతో అన్న.. ఆఫీసర్స్​​క్లబ్‍లో తమ్ముడు

అన్న వినయ్‍భాస్కర్‍ లెక్కనే తమ్ముడు విజయ్‍ భాస్కర్‍ ఉన్నాడన్నారు. అన్న ఆఫీస్‍ పేరుతో భూకబ్జాలు చేస్తే తమ్ముడు ఆఫీసర్స్​ క్లబ్‍లో అక్రమాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే నాయిని అన్నారు. రూ.3 నుంచి 4 లక్షలు కడితేనే మెంబర్‍షిప్‍ సరిగ్గా దొరకదని, కానీ రెండో తరగతి చదివినోడు గవర్నమెంట్‍ ఎంప్లాయ్‍ పేరుతో ఆఫీసర్స్​క్లబ్​లో లైఫ్‍ మెంబర్‍షిప్‍ పొందాడని దాస్యం విజయ్‍భాస్కర్‍ను ఉద్దేశించి ఆరోపించారు. 25 ఏండ్లుగా మెంబర్‍గా ఉన్నా దక్కని లైఫ్‍ మెంబర్‍షిప్‍ అతను అక్రమంగా పొందినట్లు చెప్పారు. క్లబ్‍లో రూ.6 నుంచి 7 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై కలెక్టర్‍కు ఫిర్యాదు చేశానన్నారు.