రైల్వే ఉద్యోగుల తరలింపు వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

రైల్వే ఉద్యోగుల తరలింపు వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్

కాజీపేట,వెలుగు :  కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ కు చెందిన అసిస్టెంట్ లోకో పైలెట్స్,  గార్డులను విజయవాడకు తరలింపు రద్దు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.  శనివారం కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సౌత్ సెంట్రల్ రైల్వేలోని185 మంది అసిస్టెంట్ లోకో పైలెట్లను,17 మంది గార్డులను  విజయవాడ క్రూ కంట్రోల్ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ  రైల్వే అధికారులు ఆర్డర్ ఇచ్చారన్నారు.

 కాజీపేట రైల్వే డివిజన్ కు డిమాండ్ చేస్తుండగా.. ఉద్యోగుల తరలింపు కొందరు అధికారుల అసమర్ధత వల్లే జరిగిందని ఆరోపించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య సహకారంతో రైల్వే జీఎం దృష్టి కి తీసుకెళ్తామని చెప్పారు. బదిలీ ఉత్తర్వులను రద్దు చేయకపోతే రైల్వే కార్మిక సంఘాలు, రైల్వే ట్రేడ్ యూనియన్ల నేతలతో  జేఏసీగా ఏర్పాటై పోరాడుతామని స్పష్టంచేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రెస్ మీట్ లో వరంగల్ మేయర్ గుండుసుధారాణి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్, విజయశ్రీ , రజాలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అంకూస్ తదితరులు పాల్గొన్నారు.