- వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం
పుట్టిన రోజు నాడు సరదాగా బయటకు వెళ్లిన 19 ఏళ్ల యువతి పాలిట ఆమె స్నేహితులే రాక్షసులుగా మారారు. దారుణంగా రేప్ చేసి చంపేశారు. శవాన్ని ఆమె ఇంటి దగ్గర్లోనే పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగింది.
హన్మకొండ దీన్ దయాళ్ కాలనీకి చెందిన మానస అనే 19ఏళ్ల యువతిపై ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రులకు ముగ్గురు సంతానంలో మూడో అమ్మాయి అయిన మానస డిగ్రీ పూర్తి చేసి కుటుంబపోషణలో చేదోడువాదోడుగా ఉంటోంది. కూరగాయల షాప్ నడుపుతూ వారికి అండగా అమ్మానాన్నలకు సాయంగా ఉండేది. బుధవారం పుట్టిన రోజు కావడంతో భద్రకాళి గుడికి వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లింది.
ఉదయం బయటకు వెళ్లిన ఆమె సాయంత్రం దాటినా రాకపోవడంతో ఆమె కోసం తల్లిదండ్రులు వెతుకులాడారు. ఎంతకూ కనిపించకపోవడంతో వాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో వారికి పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారి ఇంటికి సమీపంలోనే గుర్తించిన ఓ అనుమానాస్పద మృతదేహం దగ్గరకు తీసుకెళ్లారు. పుట్టిన రోజుని పొద్దున్నే సంతోషంగా బయలకు వెళ్లిన బిడ్డ అక్కడ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించారు తల్లిదండ్రులు.
రేప్ చేసి.. హత్య
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జనగామ జిల్లా నిమలిగొండ సాయి అనే యువకుడు సహా మరో ముగ్గురిపై అనుమానం ఉందని మానస తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆమెతో స్నేహంగా ఉండే సాయితో కలిసి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా.. సాయి నేరం ఒప్పుకున్నాడు. అత్యాచారం చేసి, చంపినట్లు పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంది. అయితే సాయితో పాటు అతడి స్నేహితులు కూడా ఈ నేరంలో నిందితులుగా ఉన్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.