ఇంట్లో ఇష్టమైన పెంపుడు జంతువు ఉండటం ఒకప్పుడు స్టేటస్ సింబల్ . కొందరు ధనవంతులు మాత్రమే ఇలా పెంచుకునే వారు. కానీ పరిస్థితులు మారాయి. మధ్యతరగతి జనం కూడా... ఇంట్లో ఓ మనిషిగా, ఫ్రెండ్ గా ఎవరికి ఇష్టమైన పెట్ ని వాళ్ళు పెంచుకుంటున్నారు. పావురాల దగ్గర నుంచి అక్వేరియం దాకా ...యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఓరుగల్లులోని ఓ ఇద్దరు అమ్మాయిలు కుందేళ్లను పెంచడం అందరినీ ఆకట్టుకుంటోంది.
వరంగల్ ట్రై సిటీలోని కాజీపేటకు చెందిన దివ్య, నవ్య కుందేళ్ళను పెంచుతున్నారు. దివ్య ఎంటెక్ పూర్తిచేయగా... నవ్య ఫిజియోథెరిఫీ కంప్లీట్ చేసింది. వీళ్ళకి మేనమామ రాజు రెండు కుందేళ్లను ఇచ్చాడు. వాటితో ఇప్పుడు దాదాపు 30 కుందేళ్లుగా మార్చారు. మొదటి రెండు కుందేళ్ళు మగవి కావడంతో ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవి. వీటికి తోడుగా మరో ఆడ కుందేలు తెచ్చారు. దీంతో అవి పిల్లలు పెడుతూ 40 వరకూ చేరుకున్నాయి. వాటిల్లో 10 వాహనాల శబ్దాలు, ఇతర కారణాలతో చనిపోయాయి.
కుందేళ్ళను మొదట ఇంట్లోనే పెంచుకున్నారు దివ్య, నవ్య. కానీ స్థలం సరిపోవట్లేదనీ... ప్రత్యేకంగా కుందేళ్ల కోసం ఓ రూమ్ ఏర్పాటు చేశారు. ఖాళీ స్థలంలో గడ్డి పెంచుతున్నారు. అందులో ఉదయం, సాయంత్రం రాబిట్స్ సేద తీరుతున్నాయి. ఉదయం లేవగానే డి విటమిన్ కోసం వాటిని ఎండలోకి తీసుకెళ్తున్నారు. పక్కనే కాజీపేట మార్కెట్ ఉండటంతో రోజూ వాటి కోసం క్యారెట్, క్యాబేజీ, ఆకుకూరలు తీసుకువచ్చి ఆహారంగా పెడుతున్నారు. తమతో పాటు ఇంట్లోనే తిరుగుతుంటాయనీ... చదువులో ఒత్తిడి కలిగినప్పుడు...కొద్దిసేపు కుందేళ్లతో ఆడుకుంటూ రిలాక్స్ చెందుతామని దివ్య చెబుతోంది.
ఒకప్పుడు పెద్దవాళ్లు, వృద్దులు పెంపుడు జంతువులను ఇష్టపడేవారు. కానీ ప్రసుత్తం ఈతరం అమ్మాయిలు, అబ్బాయిలు కూడా పెట్స్ ని పెంచటంలో ఆసక్తి చూపుతున్నారు. రోజూ వాటితో గడపడం సరదాగా మారిందని నవ్య చెబుతోంది. సాధారణంగా కుక్కలు పెంచుతుంటారనీ.... కానీ తమకు కుందేళ్లతో టైమ్ స్పెండ్ చేయడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
ఈ కుందేళ్ళతో ఆడుకోడానికి చుట్టుపక్కల ఇళ్ళ నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు. వచ్చే పిల్లల్లో కొందరు ఎవరో కూడా తమకు తెలియదనీ... ఒకరి నుంచి మరొకరికి తెలియడంతో తమ ఇంటికి వస్తున్నారని చెబుతున్నారు. కుందేళ్లతో ఆడుకోవడం... వాటికి కావాల్సిన ఆహారం తీసుకురావడంతో తామూ సాయం చేస్తున్నట్టు చిన్నారులు చెబుతున్నారు.