ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ములుగు, వెలుగు: స్టూడెంట్లకు మంచి, చెడుతో పాటు ప్రశ్నించేతత్వం నేర్పాలని టీచర్లకు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. శనివారం ములుగులో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన ఆ సంఘం వజ్రోత్సవ వేడుకలు నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా సీతక్క హాజరై మాట్లాడారు. టీచర్లు, పిల్లలకు నాణ్యమైన విద్య అందించి మెరికల్లా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన టీచర్లు, స్టూడెంట్లకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత రెడ్డి, మాజీ అధ్యక్షుడు భుజంగరావు, డీఈవో జి.పాణిని, సెక్టోరియల్ ఆఫీసర్లు, యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.

గురుకులాల శుభ్రతకు స్పెషల్ డ్రైవ్

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని గురుకులాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ‘స్వచ్ఛ గురుకులాల స్పెషల్ డ్రైవ్’ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. గురుకులాల్లో శానిటేషన్ నిర్వహణపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఈ నెల 5 నుంచి 11వరకు జిల్లాలోని గురుకులాలు, స్కూళ్లు, కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. శానిటేషన్ పై స్టూడెంట్లకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. డైనింగ్ రూం శుభ్రత, మొక్కలు నాటడం, సాంస్కృతిక పోటీలు తదితర కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్​ఎం జూలూరు యాదగిరి, ఐ.శారద, మల్లయ్య, అంకయ్య, ఆఫీసర్లు పాల్గొన్నారు.

 మెనూ ప్రకారం భోజనం అందించాలి    ఐటీడీఏ పీవో అంకిత్​

మహాముత్తారం, మహాదేవ్​పూర్, వెలుగు: ఆశ్రమ స్కూళ్లలో మెనూ ప్రకారం స్టూడెంట్లకు భోజనం పెట్టాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, మహదేవ్ పూర్, కాళేశ్వరంలోని ఆశ్రమ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులు, వాటర్ ప్లాంట్లు, సోలార్ వాటర్ హీటర్లు, బయోమెట్రిక్ పరికరాలను పరిశీలించారు. స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని  హెచ్ఎంలు, వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు. స్కూల్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు.

వీఆర్ఏల గోస సర్కారుకు పట్టదా?

ధర్మసాగర్, వెలుగు: వీఆర్ఏల గోస సర్కారకు పట్టడం లేదని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ స్టేట్ లీడర్ మదాసు వెంకటేశ్​డిమాండ్ చేశారు. శనివారం ధర్మసాగర్ మండలకేంద్రంలో వీఆర్ఏల దీక్షకు సంఘీభావం తెలిపారు. సమ్మె ఖర్చుల నిమిత్తం రూ.5వేల ఆర్థిక సాయం చేశారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వీఆర్ఏలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మసాగర్ మండలాధ్యక్షుడు గంకిడి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు చట్ల రాజు, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి విజయ్ చందర్ తదితరులున్నారు.

వీఆర్ఏల గోస పట్టదా?

కమలాపూర్, వెలుగు: వీఆర్ఏలు 41 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం ఆయన కమలాపూర్ మండలకేంద్రంలో వీఆర్ఏల దీక్షకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈటల మల్లయ్య సంస్మరణ సభకు హాజరయ్యారు.

‘ఓట్ల కోసం ఎస్సీలను వాడుకుంటున్రు’
    కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి: భట్టు రవి

మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: దళితులకు ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, రాష్ట్రంలోని దళితులంతా ఏకమై కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి భట్టు రవి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో ఎస్సీ మోర్చా లీడర్లతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు మారుతాయని, ఆశపడ్డ దళితులను కల్వకుంట్ల కుటుంబం ఓట్ల కోసం వాడుకుంటోందని మండిపడ్డారు. ఏడేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్​ లోన్లు లేవని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు పత్తా లేకుండా పోయాయని విమర్శించారు. కేంద్రంలో 12మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు. ఎస్సీ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బండారి రవీందర్, జనరల్ సెక్రటరీ ఆకునూరి సదయ్య, మండల ప్రెసిడెంట్ రమేశ్ తదితరులున్నారు.

విలేకర్ల ఇండ్ల నిర్మాణంపై రియల్టర్ల దాడులు!

    పిల్డర్లను కూల్చేసే ప్రయత్నం
    అడ్డుకున్న జర్నలిస్టులు: ఆఫీసర్లకు ఫిర్యాదు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జర్నలిస్టులు కట్టుకుంటున్న ఇండ్లపై రియల్టర్లు అక్రమంగా దాడులు చేశారు. పిల్డర్లను కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జర్నలిస్టులు అడ్డుకుని, ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 2013లో పట్టణంలోని సర్వే నెం.141లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించింది. ప్రస్తుతం వారంతా ఇండ్లు నిర్మించుకుంటుండగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని, పిల్డర్లు కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జర్నలిస్టులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నాయి. విచారణ చేపట్టిన సీఐ రాజిరెడ్డి.. రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో అవి జర్నలిస్టుల భూములేనని తేల్చారు. యధావిధిగా ఇండ్ల నిర్మాణం చేసుకోవచ్చని, ఎవరూ అడ్డుకోవద్దని చెప్పారు. కాగా, దాడులు చేసిన వారిపై, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విలేకర్లు డిమాండ్ చేశారు.

ఏజెన్సీ చట్టాలు అమలు చేయాలి

వెంకటాపురం, వెలుగు: ఏజెన్సీలో గిరిజన చట్టాలు అమలు చేసేంత వరకు ఉద్యమం ఆపబోమని ఆదివాసీ నవ నిర్మాణ సేన నాయకులు స్పష్టం చేశారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో 12వ రోజు దీక్షలు  చేశారు. రాజ్యాంగం కల్పించిన చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఎల్ టీఆర్(1/70), పెసా తదితర చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు, వ్యాపారాలు అరికట్టాలన్నారు. వీరి దీక్షకు భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య సంఘీభావం తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఏఎన్ఎస్ రాష్ట్ర నాయకులు కోర్శ నరసింహమూర్తి ఉన్నారు.

గ్రాండ్ గా నిట్ కాన్వొకేషన్

కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్ 20వ కాన్వొకేషన్ తొలి రోజు సందడిగా సాగింది. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్టుగా బనారస్ హిందూ యూనివర్సిటీ వీసీ ప్రొ. సుధీర్ కే జైన్, నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు హాజరయ్యారు. మొత్తం 893 మంది అండర్ గ్రాడ్యుయేట్లకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ కే జైన్ మాట్లాడుతూ.. నిరంతర సాధన వల్లే లక్ష్యాలు చేరువవుతాయన్నారు. సమాజంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లకు నైతిక విలువలు అవసరమని, సంపాదనే ముఖ్యం కాకుండా బంధాలకు విలువనివ్వాలన్నారు. ఎన్వీ రమణారావు మాట్లాడుతూ.. 2021‌‌–22 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ విద్యార్థులతో కలుపుకొని రికార్డ్ స్థాయిలో 1,132మంది వివిధ కంపెనీల్లో ప్లేస్ మెంట్లు సాధించారని తెలిపారు. పట్టాలు పొందిన స్టూడెంట్లు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా, అన్ని బ్రాంచ్ ల వారీగా టాపర్ గా నిలిచిన కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బి.శ్రీహర్ష ఇనిస్టిట్యూట్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

ములుగు, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ములుగు జిల్లా సెషన్స్ జడ్జి పీవీపీ లలితా శివజ్యోతి కోరారు. శనివారం ములుగు జిల్లాకేంద్రంలోని న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి ఏరియా ఆస్పత్రి వరకు రోడ్ సేఫ్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి లలితా శివజ్యోతి మాట్లాడుతూ.. కార్లు, బైకులు నడిపే వారు సీట్ బెల్టులు, హెల్మెట్లు ధరించాలని కోరారు. లారీలు, బస్సుల డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ములుగు సబ్ కోర్టు జడ్జి మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.రాంమోహన్​ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య తదితరులున్నారు.

యువత ఓటర్లుగా చేరాలి:జిల్లా కలెక్టర్ శశాంక

మహబూబాబాద్, వెలుగు: 18 ఏండ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్టోరియల్ ఆఫీసర్ శశాంక సూచించారు. శనివారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్ లతో కలిసి జిల్లా, మండల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుపై చర్చించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యే విధంగా డ్వాక్రా సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ, రైతు వేదికల ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆధార్ అనుసంధానం కూడా తప్పనిసరి చేయాలన్నారు. గ్రామాల వారీగా జనన, మరణ రిజిస్టర్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని.. దీనిపై ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్​డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్​ సూర్యనారాయణ, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవోలు కొమురయ్య, రమేశ్ 
తదితరులున్నారు.

ఫేక్ లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలి

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నకిలీ సర్టిఫికేట్లతో కొనసాగుతున్న లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని కేయూ విద్యార్థి జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఫేక్ సర్టిఫికెట్లతో మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ లీడర్లు ఇట్టబోయిన తిరుపతి యాదవ్, మేడ రంజిత్ కుమార్, ఎండీ పాషా, వినోద్ లోక్ నాయక్, పైయిండ్ల యాకన్న తదితరులున్నారు.

నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు

వరంగల్‍ సిటీ, వెలుగు: ట్రైసిటీలో వినాయక నిమజ్జనం కోసం పక్కా ఏర్పాట్లు చేసినట్లు వరంగల్, హనుమకొండ కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. శనివారం కమిషనర్ ప్రావీణ్య, ఆర్డీవో మహేందర్​జీ, సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్, ఆర్డీవో వాసు చంద్రతో కలిసి వేర్వేరుగా వివిధ చెరువులను పరిశీలించారు. ‘కుడా’ సాయంతో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. చెరువుల వద్ద బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, హెల్త్ వంటి శాఖలను అప్రమత్తం చేశామన్నారు.

అవిశ్వాస తీర్మానం రద్దు

నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ చెప్పారు. శనివారం నిర్వహించిన తీర్మాన సమావేశానికి 13 మంది వార్డు మెంబర్లకు గాను ఆరుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం పెట్టలేమని ఆర్డీవో తేల్చి చెప్పారు. ఉప సర్పంచ్​గా వీరభద్రం కొనసాగుతారని స్పష్టం చేశారు. కాగా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, వార్డు మెంబర్లంతా వీరభద్రం పక్షాన నిలిచారని పీఎసీఎస్ చైర్మన్ మారం రాము, రమేశ్ ​యాదవ్ అన్నారు.