తనిఖీల్లో వరంగల్​ కొత్త కలెక్టర్​ బీజీ

  • రోజంతా ఆకస్మిక తనిఖీలు, పరిశీలనలు, సమీక్షలు 

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కొత్త కలెక్టర్‍ డాక్టర్‍ సత్య శారదాదేవి వచ్చిరావడంతోనే డ్యూటీలో బిజీబిజీ అయ్యారు. మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీలు, మార్కెట్​ యార్డుల పరిశీలనలు, వివిధ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే అగ్రికల్చర్‍ డీఏవో ఉషాదయాల్‍, తహసీల్దార్‍ ఇక్భాల్‍తో కలిసి జిల్లాలోని పలు విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, యూరియా అమ్మితే సహించేదిలేదని హెచ్చరించారు. ఆపై ఏనుమాముల మార్కెట్‍ గోదాం నంబర్‍ 11లో పార్లమెంట్‍ పరిధిలోని ఈవీఎం స్ట్రాంగ్‍ రూంలను పరిశీలించారు.

 అనంతరం మార్కెట్‍ యార్డులో పత్తి విక్రయాలను తీరును పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టరేట్‍లోని జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారికి చేరేలా మానవతా ధృక్పథంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్​వో వెంకటరమణ, హెల్త్​ అండ్‍ మెడికల్‍ డిపార్ట్ మెంట్‍ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రైవేట్​ఆస్పత్రులు రూల్స్​ బ్రేక్‍ చేయకుండా చూడాలని ఆదేశించారు. సాయంత్రం అడిషనల్‍ కలెక్టర్‍ సంధ్యారాణి, ఇతర రెవెన్యూ డివిజన్‍ అధికారులు, తహసీల్దార్లతో మీటింగ్‍ పెట్టి ధరణి పెండింగ్‍ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ గెజిటెడ్‍ ఆఫీసర్స్​అసోసియేషన్‍ నేతలు, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‍ అసోసియేషన్‍ నేతలు మర్యాదపూర్వకంగా కలెక్టర్‍ను కలిశారు.