వరంగల్ జూపార్కుకు కొత్త కళ

వరంగల్ జూపార్కుకు కొత్త కళ
  • కాకతీయ జూపార్క్​లోకి పెద్దపులుల జోడి
  • నాలుగు మూషిక జింకలొచ్చినయ్‍.. త్వరలోనే అడవి దున్న
  • హైదరాబాద్‍ జూ నుంచి వరంగల్‍ తెప్పించిన అధికారులు 
  • పులుల రాకపై సోమవారం ‘వీ6 వెలుగు’లో కథనం.. 
  • నేడు టైగర్‍ ఎన్‍క్లోజర్‍ ప్రారంభించనున్న  మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కాకతీయ జూపార్కులోకి రెండు పెద్దపులుల రాకతో కొత్త కళ వచ్చింది. 15 ఏండ్ల వయసున్న కరీనా, 10 ఏండ్ల వయసుండే శంకర్‍ ఆడమగ పులుల జంటను హైదరాబాద్‍ నెహ్రూ జూపార్క్​నుంచి తీసుకురావడంతో వరంగల్‍ పార్క్​కు నయా లుక్‍ వచ్చింది. దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో ఈ ఏడాది మొదట్లో పులులు తీసుకురావడానికి అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పులుల రాకకు రూట్‍ క్లియర్‍ అయింది.

 ఏడెనిమిది నెలలుగా రూ.70 లక్షలతో టైగర్‍ ఎన్‍క్లోజర్‍ పనులు పూర్తి చేశారు. పులులతో పాటు నాలుగు మూషిక జింకలను సైతం తీసుకువచ్చారు. త్వరలోనే అడవిదున్నను తీసుకురానున్నారు. కాగా, ఓరుగల్లు జూపార్కుకు ఈ వారంలోనే పెద్దపులులు తీసుకురానున్నారనే వార్తను 'వీ6 వెలుగు' సోమవారమే కథనం ఇచ్చింది.  

48 ఎకరాల్లో.. 417 రకాల జంతువులు 

వరంగల్లోని కాకతీయ జూపార్క్​ఉత్తర తెలంగాణ జిల్లాల జనాలు, ఇతర ప్రాంతాలనుంచి ఓరుగల్లుకు వచ్చే టూరిస్టులను ఆకర్షిస్తోంది. 1985లో 47.64 ఎకరాల్లో పార్క్​ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జూలో 10 జాతులకు చెందిన 164 వణ్య ప్రాణులైన జంతువులున్నాయి. ఇందులో చిరుతలు, గుడ్డెలుగులు వంటి క్రూర మృగాలకుతోడు 5 జాతుల సరీసృపాలు 72 ఉన్నాయి. 29 జాతులకు చెందిన 181 పక్షులున్నాయి. మనుబోతు, కొండ గొర్రెలు, ఆస్ట్రిచ్, కృష్ట జింకలతో పాటు మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. నెమళ్లు, హంసలు, లవ్‍ బర్డ్స్అలరిస్తున్నాయి.

పులుల రాకతో పెరగనున్న టూరిస్టులు

పెద్ద పులులు తీసుకువచ్చిన నేపథ్యంలో వాటిని టూరిస్టులు చూసేందుకు బుధవారం నుంచి అనుమతి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ టైగర్‍ ఎన్‍క్లోజర్‍ను ప్రారంభించనున్నట్లు జూ ఆఫీసర్లు పేర్కొన్నారు. కొత్తగా పెద్ద పులులు, మూషిక జింకలు రావడంతో పార్క్​మరింత అలరించనుంది. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీల నుంచి పిల్లలను విహారయాత్రలకు తీసుకువెళ్లే సీజన్‍ నడుస్తోంది. దగ్గర్లోనే న్యూ ఇయర్‍, ఆపై వరుసగా సంక్రాంతి, వేసవి సెలవులు రానున్ననేపథ్యంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక పెరగనుంది.