
- మార్చి ఫస్ట్ వీక్‌లో వార్డు సభలు?
- ఇందిరమ్మ ఇండ్లసర్వే దాదాపు పూర్తి
- ముందే అర్హులనుప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో మార్చి మొదటివారంలో వార్డుసభలు నిర్వహించేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. ఇంతకుముందు ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో పెట్టాలని అనుకున్నా ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో నిర్వహించలేదు. ఇప్పుడు ఇండ్ల సర్వే 96 శాతం వరకు పూర్తి కావడంతో మార్చి మొదటివారంలో వార్డు సభలు పెట్టడానికి ప్లాన్చేస్తున్నారు. ఈ సభల్లోనే రేషన్ కార్డుల అర్హుల జాబితాతో పాటు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్ట్ప్రకటించనున్నారు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,70,659 దరఖాస్తులు రాగా, ఇందులో సర్వే ద్వారా అర్హులను గుర్తిస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వంద శాతం పూర్తి కాగా, కంటోన్మెంట్ లో 85శాతం సర్వే మాత్రమే జరిగింది. మొత్తం పూర్తవడానికి మరో 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉండడంతో వచ్చే నెల మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు.
రేషన్ అర్హుల జాబితా ముందే ప్రకటించాలి
గ్రేటర్లో రేషన్ కార్డుల కోసం 83,285 మంది అప్లై చేసుకోగా, దాదాపు 75వేల మంది అర్హులను ఎంపిక చేశారు. అయితే, వార్డు సభలు పెట్టకపోవడంతో అర్హులను ప్రకటించలేదు. వారం కింద మళ్లీ మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో ఇంతకుముందు అప్లై చేసుకున్నవారు కూడా మళ్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.
రాష్ట్రంలోని మిగతా చోట్ల గ్రామ సభలు పెట్టడంతో అర్హులెవరో, అనర్హులెవరో తేలింది. సిటీలో వార్డు సభలు పెట్టకపోవడంతో సమస్య ఏర్పడింది. ఎట్లాగూ రేషన్‌కార్డుల లబ్ధిదారులను ఫైనల్చేశారు కాబట్టి వార్డుసభల కంటే ముందే అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.