- ముగ్గురు వంట సిబ్బంది తొలగింపు
- ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్టీ హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. హాస్టల్‌లో ఉంటున్న 15 మంది స్టూడెంట్లు ఫుడ్‌పాయిజన్ కారణంగా ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో వార్డెన్ విశ్వకుమారిని సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురు వంట సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆర్డర్స్ జారీ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల అస్వస్థతకు గురైన స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లకు సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. వారి వెంట కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ, కౌన్సిలర్ రత్నమాల, తహసీల్దార్ తారాసింగ్ పాల్గొన్నారు.