- ముంపు లెక్క తేలాకే డీపీఆర్‌కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర
- జాయింట్ సర్వే చేపట్టాలంటూ లేఖ
- మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌తో ఆ రాష్ట్రంలో మునుగుతున్న పంట పొలాలు
- తెలంగాణ పరిహారం చెల్లించకపోవడంతో.. సిరొంచలో ఆందోళనలు
మంచిర్యాల, వెలుగు:ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా నిర్మించతలపెట్టిన వార్దా బ్యారేజీకి కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో చిక్కులు ఎదురవుతున్నాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ రాష్ట్రంలో భూములు నీట మునగడం, రైతులు ఆందోళన చేస్తుండడంతో మహారాష్ట్ర సర్కార్వార్దా ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనంటూ తెలంగాణకు ఇప్పటికే లేఖ రాసింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో పంటలు నీట మునిగిన తమ రైతులకు పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ తెలంగాణ సర్కారు ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో వార్దా ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ముంపుపై క్లారిటీ వచ్చాకే డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతామని తేల్చి చెప్పింది. ఇందుకోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి జాయింట్ సర్వే చేయాలని మెలికపెట్టింది. దీంతో వార్దా ప్రాజెక్టు నిర్మాణం డైలమాలో పడింది.
ముంపు ముప్పుపై భయం..
ప్రాణహిత ప్రాజెక్టు రద్దుతో ఆగ్రహంతో ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాల రైతులను ప్రసన్నం చేసుకునేందుకు వార్ధా ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వ. సుమారు రూ.5వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రతిపాదించింది. తెలంగాణలో 3,076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు, మొత్తం 3,817.31 ఎకరాల భూమిని సేకరించాలని డీపీఆర్‌లో పేర్కొంది. 155 నుంచి 160 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి 11.50 టీఎంసీల నీటిని లిఫ్ట్చేస్తామని పేర్కొంది. ఇప్పటికే ముంపు ప్రభావం, ప్రభావిత గ్రామాలపై తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ఇంజనీర్లు జాయింట్సర్వే నిర్వహించారు. దాని ప్రకారం ప్రభుత్వం వార్ధా డీపీఆర్‌ను రెడీ చేసింది. అయితే నిరుడు జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్వాటర్వల్ల తెలంగాణతోపాటు మహారాష్ట్ర సిరొంచ తాలూకాలో వేల ఎకరాల భూములు మునిగాయి. ముంపు భూములకు ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని అక్కడి రైతులు ఆందోళన బాట పట్టారు. ఇది ‘మహా’ సర్కారుకు రాజకీయంగా తలనొప్పులు తెచ్చింది. ఇదే తరహాలో భవిష్యత్‌లో వార్ధా ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తమ భూములు మునిగిపోతే పరిస్థితి ఏంటన్న భయం అక్కడి సర్కారుకు పట్టుకుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో రైతుల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మళ్లీ వార్ధా ప్రాజెక్టు ముంపుతో కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నది. దీంతో బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై స్పష్టత వచ్చాకే వార్దా ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతామని మహారాష్ట్ర జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లెటర్రాయడంతో పరిస్థితి మొదటికి వచ్చింది.
అక్కడి రైతులకూ మొండిచేయి
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో పొలాలు ముంపునకు గురవుతున్న రాష్ట్ర రైతులనే కాకుండా మహారాష్ట్ర రైతులకు కూడా మొండిచేయి చూపింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం సమయంలో మహారాష్ట్ర వైపు మునిగిపోతున్న భూములకు ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. బ్యారేజీలో ఫుల్రిజర్వాయర్లెవల్ (ఎఫ్ఆర్ఎల్) నీటిని నిల్వ చేయడంతో ముంపు విస్తీర్ణం మరో వెయ్యి ఎకరాలు పెరిగింది. వరదలకు ఇంకో 3 వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. సిరొంచ, పోచంపల్లి, మద్దికుంట, అంకీస, అరుడ, జానంపల్లి, రాజన్నపల్లి, చింతలపల్లి, కారస్పల్లి, రామకృష్ణాపూర్, ముగాపూర్, మృదుకృష్ణాపూర్తో పాటు మొత్తం 12 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ భూములకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని రైతులు నాలుగేండ్లుగా పోరాడుతున్నారు. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సిరొంచలో 36 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిసెంబర్లో నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ ఎదుట దీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్స్పందించి ముంపు రైతులకు పరిహారం అందిస్తామని డిసెంబర్22న హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.11.40 లక్షలు, బీడు భూములకు రూ.10 లక్షలు చెల్లించడానికి ఒప్పుకుందని, త్వరలోనే పరిహారం పైసలు అందజేస్తామని ఈ ఏడాది జనవరి 6న గడ్చిరోలి జిల్లా కలెక్టర్సిరొంచ తహసీల్దార్ ఆఫీసులో రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. కానీ తెలంగాణ సర్కారు నేటికీ ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని వార్ధా ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్అయ్యింది. బ్యాక్వాటర్లెవల్, రైతులకు చెల్లించే పరిహారం విషయంతో క్లారిటీ వచ్చాకే వార్ధా డీపీఆర్‌కు ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో వార్ధా ప్రాజెక్టు అంతర్రాష్ట్ర ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్‌కు వార్ధా ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి లేదని, ఇది కేవలం ఎన్నికల స్టంట్అని విమర్శిస్తున్నారు.