వరంగల్/హనుమకొండ సిటీ, వెలుగు: పదేండ్ల పాలనలో సెక్రటేరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్ ఇప్పుడు పొలం బాట పట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ కేసీఆర్ నిద్రలేచిన ఫాంహౌజ్ కుంభకర్ణుడని, కూతురు కవిత జైల్‍కు వెళ్లడంతో మతిస్థిమితం తప్పిండని అన్నారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఏటీఎం మిషన్ లెక్క వాడుకున్నాడని ఆరోపించారు. రైతుల కన్నీళ్లకు కారకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డలో పిల్లర్లు కుంగి నీళ్ల పోయినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ వందల కోట్ల స్కామ్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బయటకు తీస్తుందని చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల పర్యటనలో కేసీఆర్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాడని, ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్లు ఎందుకివ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్‍కు దమ్ము, ధైర్యముంటే చట్టసభల్లో మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్‍రెడ్డిని బీఆర్‍ఎస్ నేతలు గుంపుమేస్త్రీ అంటున్నారని, ఆయన కేసీఆర్ ప్రభుత్వ పాపాలు, లోపాలను సరిచేసే ముఠామేస్ర్తీ అంటూ చురకలంటించారు. ఈ ప్రెస్ మీట్ లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీసం సురేందర్ రెడ్డి, నిమ్మని శేఖర్ రావు, నాయకులు పాల్గొన్నారు.