పోలవరంతో ముప్పు తప్పదన్న హెచ్చరికలే నిజమైతున్నయ్​

భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాద్రి వద్ద గోదావరి తీరప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతుందని ఐఐటీ నిపుణులు చెప్పిన మాట నిజమైంది. దిగువన డ్యాం నిర్మాణంతో కాపర్​ డ్యాం, స్పిల్​వే వల్ల బ్యాక్ వాటర్​తో ఐదు రోజులుగా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 50 అడుగుల వద్దే నిలకడగా ఉంటోంది. ఇక ముంపు మండలాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉంది. 30 రోజులుగా జలమయమై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయడానికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. రోగమొస్తే దవాఖానాకు వెళ్లేందుకు దారి ఉండడం లేదని వాపోతున్నారు. బడులు తెరుచుకోవడం లేదని, నేటికి కొన్ని ప్రాంతాలకు కరెంటు లేదని వాపోతున్నారు. జనం, పచ్చని పైర్లు, మూగజీవాలతో కళకళలాడే పల్లెలు ఇప్పుడు సాగరాన్ని తలపిస్తున్నాయి. 

పొంచి ఉన్న ముప్పు..

గత నెలలో భద్రాచలం వద్ద 71.3 అడుగుల వరద నమోదు కాగా, ఆ సమయంలో పోలవరం డ్యాం వద్ద 26 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. అయితే భద్రాచలం వద్ద 22లక్షల క్యూసె
క్కులుగా ఉంది. 1986 వరదల సమయంలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు సగం పనులే అయ్యాయి. 49 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం అంచనాతో 150 అడుగుల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం రామాలయానికి కూడా ముంపు ముప్పు తప్పదు. ఇదే విషయాన్ని తెలంగాణ ఇంజనీర్ల బృందం, ఐఐటీ నిపుణులు, పర్యావరణ వేత్తలు కూడా చెప్పారు. అయినా ఏపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తోంది. 

రోడ్లపైకి వరద నీరు..

గోదావరికి 50  అడుగులు వరద వచ్చినా గతంలో రహదారులు మునిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం భద్రాచలం నుంచి -పేరూరు, వీఆర్ పురం, జగదల్​పూర్, -ఒడిశా, -కుక్కునూరు మార్గాలన్నీ మునిగాయి. ప్రస్తుత పరిస్థితి పోలవరం ప్రాజెక్టుతో ముంపు ప్రాంతాల భవిష్యత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఏడాది పొడవునా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుందని అంచనా వేశారు. ఏటా సాధారణంగా 13 లక్షల క్యూసెక్కుల వరద భద్రాచలం వద్ద ప్రవహిస్తుంది. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా భద్రాచలం ఇక ద్వీపంగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

367 గ్రామాల్లో వరద బీభత్సం

పోలవరం బ్యాక్​వాటర్​, గోదావరి వరదల వల్ల ఇటీవల ఏపీ, తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో 367 గ్రామాలు నీట మునిగాయి. విలీన మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడుల్లో 126 గ్రామాలు, ఎటపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురంలలో 142 గ్రామాలు, తెలంగాణలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో 99 గ్రామాలు మునిగాయి. వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోనూ 50కి పైగా గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. 

కాలనీల్లోకి గోదావరి వరద

గోదావరి కరకట్ట స్లూయిజ్​ల వద్ద లీకేజీ కారణంగా భద్రాచలం కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ఆదివారం సాయంత్రం 50.60 అడుగుల మేర  12,91,256 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. కరకట్టపై ఏఎంసీ, అయ్యప్ప, అశోక్​నగర్​ కొత్తకాలనీల వద్ద స్లూయిజ్​లు లీకై నీరు వస్తోంది. దీంతో  కాలనీల ప్రజలను రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మణుగూరు మండలంలో 8 మి.మీలు, దుమ్ముగూడెంలో 7.8 మి.మీల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడం, దిగువన పోలవరం బ్యాక్​ వాటర్, శబరి, సీలేరు నదుల ఎగపోటు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గడం లేదు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, -గంగోలు మధ్య బొక్కలవాగు పొంగడం, గోదావరి ఎగపోటు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రాజెక్టు నిర్మాణం ఆపాలి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెంటనే ఆపాలి. లక్షలాది మంది ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. భద్రాద్రి రామాలయం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆర్అండ్ఆర్​ ప్యాకేజీతో పాటు పక్క రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాలకు కూడా పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి. 

- చందా లింగయ్య దొర, ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్​