- ఇండ్లలోకి రాకపోతే పట్టాలు రద్దు అవుతాయని పైసలు వసూల్
- విద్యుత్ శాఖ పేరిట కూడా మోసాలు
- రూ.వేలకు వేలు గుంజుతున్న కేటుగాళ్లు
- ప్రతాపసింగారం, బాటసింగారం, బాచుపల్లిల్లో ఘటనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని ప్రతాపసింగారం, బాటసింగారం, బాచుపల్లి పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉంటున్న జనాలు నిత్యం ఏదో ఒక ఫేక్ కాల్‌తో ఆందోళనకు గురవుతున్నారు. ఇండ్లలోకి రాకముందు, వచ్చిన తర్వాత వారికి వేధింపులు తప్పడం లేదు. లాటరీలు తీసి ఇంకా గృహ ప్రవేశం చేయకముందే కరెంట్ రిపేర్ల కోసమని, వాటర్ లైన్ , ఇండ్ల రిపేర్ల కోసమంటూ కేటుగాళ్లు ఫోన్లు చేసి అందినకాడికి దండుకున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది మోసపోయారు. తాజాగా హైడ్రా ట్రెండ్నడుస్తుండడంతో హైడ్రా, ఎలక్ట్రిసిటీ అధికారుల పేరిట ఇండ్లలోకి వచ్చిన వారిని, కేటాయించినా ఇంకా రానివారికి ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.
‘ మీ డబుల్ ఇండ్లపై హైడ్రా విచారణ జరుగుతోంది. మీరు ఇంకా ఇండ్లలోకి రాలేదు. డబ్బులివ్వకపోతే మీ ఇంటి పట్టాలు రద్దవుతాయి’ అని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని రూ.1250 కట్టకపోతే కరెంట్ మీటర్ మీ పేరుపై కాదని కాల్స్ చేస్తున్నారు. రూ.5 వేలు అంతకు మించి డబ్బులను ఫోన్ పే, గూగుల్ పే చేయించుకుని జేబులు ఖాళీ చేయిస్తున్నారు.
హైడ్రా ట్రెండింగ్‌లో ఉండడంతో...
బాటసింగారంలో సుమారు1400 , ప్రతాపసింగారంలో 2200, బాచుపల్లిలో 1200 డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తి చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే అధికారులు లాటరీలు తీసి పట్టాలు అందజేశారు. అయితే మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించకపోవడంతో మూడు చోట్ల కలిపి వెయ్యి మంది మాత్రమే ఇండ్లలోకి వచ్చారు.
నీటి సౌలత్సరిగ్గా లేకపోవడం, కరెంట్సమస్యలు ఉండడం, లిఫ్ట్‌లు పని చేయకపోవడంతో చాలా మంది గృహ ప్రవేశం చేయలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు ఇండ్లలోకి రాని వారిని ఒక కారణంతో, వచ్చిన వారిని మరో కారణంతో బెదిరించి దండుకున్నారు. ఇప్పుడు స్టైల్మార్చి హైడ్రా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్పేరిట చీట్ చేస్తున్నారు.
లాటరీ లిస్ట్ బయటకు పోవడంతోనే..
డబుల్ ఇండ్లను ప్రజలకు అందించిన సమయంలో ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లాటరీలు తీశారు. ఆ లాటరీ లిస్ట్‌లో లబ్ధిదారుల పేర్లతో పాటు ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. దీంతో ఇవి బయటకు పోయి కేటుగాళ్లకు చిక్కడంతో మోసాలు చేస్తున్నారు. ఆ డేటా యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చేరడంతో అక్కడి నుంచే ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు.