తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ లో ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని.. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్న మంత్రి... హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాలు పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నామంటూ.. ఆ త్యాగదనులందరికీ నివాళులర్పించారు.
వరంగల్ నగరం వరద ముంపునకు గురికాకుండా వరద నీరు సాఫీగా వెళ్లడానికి నాళాలను నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో నిరాధారణకు గురైన చారిత్రాత్మక కాకతీయ కాలంనాటి గుడులను పునరుద్ధరించి ధూప దీప నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.గత ప్రభుత్వం వరంగల్ లో నిర్మించ తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.