
మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ సారి నిరాశే మిగిలింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్ లో కనీసం ఫైనల్ కు చేరలేకపోయాయి. భారత కాలమాన ప్రకారం సోమవారం(జూలై 29) ఉదయం జరిగిన ఫైనల్లో స్మిత్ నాయకత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం 2024 మేజర్ లీగ్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ మెగా ఫైనల్లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ విఫలమైనా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 88 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.
208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూనికార్న్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. వాషింగ్టన్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడం ఆ జట్టును దెబ్బ తీసింది. మార్కో జన్సెన్, రచిన్ రవీంద్ర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఆండ్రూ టై రెండు వికెట్లు తీసుకోగా.. సౌరభ్ నేత్రావల్కర్, మ్యాక్స్‌వెల్ కు తలో వికెట్ దక్కింది. వాషింగ్టన్ టీమ్‌కు టీమిండియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్టీవ్ స్మిత్ కు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
WASHINGTON FREEDOM ARE WINNER OF MAJOR LEAGUE CRICKET 2024🏆#MLC2024 https://t.co/vqwtlR2yOv
— INSTANT CRICKET NEWS 🇮🇳 (@InstantCricinfo) July 29, 2024