IND vs ZIM 2024: అతను బౌలర్ల కెప్టెన్.. గిల్ కెప్టెన్సీపై సుందర్, అవేశ్ ఖాన్ ప్రశంసలు

IND vs ZIM 2024: అతను బౌలర్ల కెప్టెన్.. గిల్ కెప్టెన్సీపై సుందర్, అవేశ్ ఖాన్ ప్రశంసలు

జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ తన కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. తొలి టీ20 లో ఓడిపోయిన తర్వాత అతని కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో జట్టుకు విజయాలను అందించాడు. బ్యాటర్ గా,కెప్టెన్ గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ తో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్.. తమ జట్టు గుజరాత్ టైటాన్స్ ను ప్లే ఆప్స్ కు చేర్చడంలో విఫలమైనా కెప్టెన్ గా మంచి మార్కులే పడ్డాయి. దీంతో జింబాబ్వే టూర్ లో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.   

తాజాగా గిల్ కెప్టెన్సీపై టీమిండియా బౌలర్లు వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్  ప్రశంసల వర్షం కురిపించారు. ఆవేశ్ ఖాన్ మాట్లాడుతూ.. "నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. ఏ దశలోనైనా బౌలింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శుభ్‌మాన్ బౌలర్ కెప్టెన్. బౌలర్లు తమ ఫీల్డ్‌లను సెట్ చేసుకునే స్వేచ్ఛను ఇస్తాడు. మన ప్రణాళికలకు మద్దతు ఇస్తాడు. ఈ రోజు నేను పడగొట్టిన వికెట్లు గిల్ కెప్టెన్సీ ద్వారా వచ్చినవే". అని అవేష్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.

వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. "గిల్ ఐపీఎల్ తో పాటు భారత జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్నాడు. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత అతని కెప్టెన్సీ అద్బుతం. బౌలర్లకు అతను సహకరించిన విధానం గొప్పగా ఉంది". అని ఈ భారత ఆల్ రౌండర్ చెప్పుకొచ్చాడు. సుందర్, ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్నసిరీస్ లో 6 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్లుగా కొనసాగుతున్నారు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శనివారం (జూలై 13) జరగనుంది. చివరిదైన 5 టీ20 ఆదివారం (జూలై 14) జరుగుతుంది.