సన్ రైజర్స్కు బిగ్ షాక్..ఐపీఎల్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్ 2023లో  వరుస ఓటములతో  చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.  స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో  ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా ప్రకటించింది.

వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నాడని సన్ రైజర్స్ హైదరాబాద్ వెల్లడించింది. వాషింగ్టన్ సుందర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తుందని సన్ రైజర్స్ పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మూడు వికెట్లు తీసుకోవడంతో పాటు.. 24 పరుగులు చేశాడు. 

ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన  వాషింగ్టన్ సుందర్..తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుందర్ దూరమవ్వడం కోలుకోలేని దెబ్బ కానుంది. వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో  రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది.  ప్రస్తుతం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. దీనికి తోడు  రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి.