
న్యూజిలాండ్ తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా ప్లేయింగ్ 11 లో కీలక మార్పు చేయనున్నట్టు తెలుస్తుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ లో లేని కుల్దీప్ యాదవ్ స్థానంలో టీమిండియా యాజమాన్యం స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట. సుందర్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు ఉండడంతో ఈ తమిళ నాడు స్పిన్నర్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.
మరోవైపు కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ప్రభావం చూపించలేకపోయాడు. ప్రత్యర్థి బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచడంలో విఫలమవుతన్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 5 వికెట్లు తీసి జట్టులో స్థానాన్ని ప్రస్నార్ధకం చేసుకున్నాడు. సుందర్ జట్టులోకి వస్తే భారత్ మరింత పటిష్టంగా మారడం ఖాయం. బౌలింగ్ లో అద్భుతమైన వేరియేషన్ చూపించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇప్పటికే జట్టులో ముగురు ఆల్ రౌండర్లు ఉండగా.. సుందర్ వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఒకవేళ కుల్దీప్ స్థానంలో సుందర్ కాకపోతే అర్షదీప్ కు ఛాన్స్ దక్కొచ్చు.
దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఆదివారం (మార్చి 9) టైటిల్ కోసం అమీతుమీ తెలుసుకోనున్నాయి. టోర్నీ మొత్తం ఓటమి లేకుండా అద్భుతంగా ఆడిన టీమిండియా ఈ మ్యాచ్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఏ జట్టు గెలిచినా వారికి రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు జరుగుతుంది. టాస్ 2:00 గంటలకు వేస్తారు. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్–18, జియో హాట్‌స్టార్‌లో లైవ్ ప్రసారమవుతుంది.
న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ ప్లేయింగ్ 11 (అంచనా) :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, వాషింగ్ టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి.