Wasim Akram: పాకిస్థాన్‌లో ఫైనల్ జరిగితే ఇండియా గెలిచేదా.. వసీం అక్రమ్ ఏమన్నాడంటే..?

Wasim Akram: పాకిస్థాన్‌లో ఫైనల్ జరిగితే ఇండియా గెలిచేదా.. వసీం అక్రమ్ ఏమన్నాడంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిని భారత్ గెలుచుకుంది. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించిన రోహిత్ సేన ఫైనల్లో కూడా అంచనాలను అందుకుంటూ మూడోసారి ఈ టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్ విజయంపై టోర్నీలో పాల్గొన్న ఇతర జట్లు సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే దుబాయ్ లోనే ఇండియా మ్యాచ్ లు ఆడడం కలిసొచ్చిందని.. వారికి అది హోమ్ గ్రౌండ్ కింద మారిపోయిందని ఇతర జట్లు తమ నిరాశను వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో టీమిండియాకు పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ అండగా నిలిచాడు. 

దుబాయ్ లోనే కాకుండా ప్రపంచంలో భారత్ ఎక్కడైనా టైటిల్ గెలవగలదని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అక్రమ్ మాట్లాడుతూ.. " ప్రస్తుత  భారత జట్టు ప్రపంచంలో ఎక్కడ టోర్నీ జరిగినా గెలవగలదు. భారత్ తమ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో ఆడాలని నిర్ణయించుకుంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్‌లో ఆడి ఉంటే, వారు అక్కడ కూడా గెలిచి ఉండేవారు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు".అంతేకాదు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటములను తట్టుకుని రోహిత్, గంభీర్ లకు అండగా నిలిచినందుకు బీసీసీఐని అక్రమ్ ప్రశంసించాడు.

Also Raed : ఏమీలేదంటూనే సైలెంట్ గా మొదలెట్టారా..?

 బీసీసీఐ,భారత ప్రభుత్వం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాకిస్థాన్ పంపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ, బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌ను నిర్ణయించాయి. సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్ తో సహా అన్ని మ్యాచ్ లను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే నిర్వహించారు. టోర్నీ సాగుతున్న కొద్దీ చాలా వివాదాలకు దారి తీసింది. ఇతర దేశాలకు దుబాయ్ నుంచి పాకిస్థాన్ కు ప్రయాణించడం కష్టంగా అనిపించింది. సెమీ ఫైనల్ సమయంలోసౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టోర్నీ షెడ్యూల్ పై  తమ అసహనాన్ని చూపించాయి.      

దుబాయ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో కివీస్ పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.