టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ టాప్ బ్యాటర్ బాబర్ అజామ్ వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్లు అనడంలో సందేహం లేదు. విరాట్ పరుగుల రికార్డులను ఒకొక్కటిగా బాబర్ బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. వీరిద్దరిని పోల్చి ఎంత మంది విమర్శించినా.. ఈ స్టార్ బ్యాటర్ల మధ్య సాన్నిహిత్యం చాలా బాగుంటుంది. తాజాగా భారత్-పాక్ మ్యాచ్ అనంతరం బాబర్ అజామ్, విరాట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగా.. వసీం అక్రమ్ బాబర్ పై అసంతృప్తి వ్యక్తం చేసాడు.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లిన బాబర్ తన జెర్సీ కావాల్సిందిగా కోరాడు. కోహ్లీ కూడా బాబర్ ని గౌరవిస్తూ చాలా ఆప్యాయంగా ఆటోగ్రాఫ్ చేసిన తన 18 నెంబర్ జెర్సీని బహూకరించాడు. ఆ తర్వాత వీరిద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకొని వీరి మీటింగ్ ని ముగించారు. అయితే బాబర్ ఇలా కోహ్లీని జెర్సీని అడగడంపై వసీం అక్రమ్ విమర్శించాడు.
A-స్పోర్ట్స్‌లో జరిగిన చాట్‌లో అక్రమ్ మాట్లాడుతూ.. "బాబర్ మైదానంలోని కెమెరాల ముందు కోహ్లీ నుండి టీ-షర్టులు అడిగాడు. అయితే ఇది కెమెరా కంటికి కనబడకుండా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర అడిగి ఉంటే బాగుండేది. మీ అంకుల్ కొడుకులు కోహ్లీ టీ షర్ట్ తీసుకురమ్మంటే అది అడగాల్సిన పద్ధతి ఇది కాదు. అని వసీమ్ అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేసాడు".
ఆటలో సీరియస్ గా ఉండాలి గాని వ్యక్తిగతంగా అందరూ బాగుంటేనే క్రికెట్ ఆరోగ్యకరంగా ఉంటుంది. కోహ్లీ దగ్గరకు వెళ్లి టీ షర్ట్ అడగడం బాబర్ వ్యక్తిగత నిర్ణయం. కానీ ఒక దిగ్గజ బౌలర్ హోదాలో ఉండి వసీం అక్రమ్ ఇలా మాట్లాడడం విమర్శలకు దారి తీస్తుంది,. వసీం బాబర్ ను విమర్శిస్తే, ప్రతి ఒక్కరు అక్రమ్ ని తప్పుపడుతున్నారు. కాగా.. ఈ మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో బాబర్ 50 పరుగులు చేస్తే కోహ్లీ 16 పరుగులు చేసాడు.