మంగళవారం(మే 21) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్వాలిఫైయర్ 1 పోరులో సన్‌రైజర్స్ కంటే కోల్‌కతానే పైచేయి సాధిస్తుందని పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, నైట్ రైడర్స్ బౌలింగ్ అటాక్‌పై ప్రశంసలు కురిపించిన అక్రమ్.. వికెట్లు తీసిన జట్లే మ్యాచ్‌లను గెలుస్తాయని జోస్యం చెప్పారు.
వికెట్ టేకింగ్ బౌలర్లతో కోల్‌కతా బలంగా కనిపిస్తోందని అక్రమ్ అభిప్రాయపడ్డారు. వేలంలో 24.75 కోట్లు ధర పలికి 17వ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన మిచెల్ స్టార్క్ తన అనుభవంతో మ్యాచ్ ఫలితాలనే మార్చేయగలడని తెలిపారు. అక్రమ్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. కోల్‌కతా ప్రధాన పేసర్లు నలుగురూ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
"కోల్‌కతా బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారు. వికెట్లు తీసిన జట్లే మ్యాచ్‌లు గెలుస్తాయి. వారు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి అదే ప్రధాన కారణం. స్టార్క్ ఒంటి చేత్తో వారిని గెలిపించగలడు. అతనికి తోడు ఇతర బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి (18 వికెట్లు), హర్షిత్ రాణా (16 వికెట్లు), ఆండ్రీ రస్సెల్ (15 వికెట్లు), సునీల్ నరైన్ (15 వికెట్లు), మిచెల్ స్టార్క్ (12 వికెట్లు) ఇలా ఈ సీజన్‌లో మొత్తం కేకేఆర్ బౌలింగ్ అటాక్ అద్భుత ఫామ్‌లో ఉంది.." అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చారు.
సాల్ట్ లేకపోవడం దెబ్బే..!
అయితే ఫిల్ సాల్ట్ లేకపోవడం వారిపై ప్రభావం చూపుతుందని అక్రమ్ పేర్కొన్నారు. ఈ సీజన్‌లో సాల్ట్ నైట్ రైడర్స్ తరపున 12 ఇన్నింగ్స్‌లలో 39.54 సగటుతో 435 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 182గాను ఉంది. మే 22 నుంచి పాకిస్తాన్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుండడంతో సాల్ట్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. క్వాలిఫైయర్ 1లో అతని స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ వచ్చే జట్టులోకి అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
కోల్‌కతా: సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.