Wasim Akram: మనశ్శాంతి లేకుండా చేస్తున్నరు.. నా భర్త నాకెప్పుడు విడాకులిచ్చారు: క్రికెటర్ భార్య ఫైర్

Wasim Akram: మనశ్శాంతి లేకుండా చేస్తున్నరు.. నా భర్త నాకెప్పుడు విడాకులిచ్చారు: క్రికెటర్ భార్య ఫైర్

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రముఖలు సుఖంగా నిద్రపోలేని పరిస్థితి. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. సోషల్ మీడియాకి చేరిందంటే, అది వివాదం అయ్యే దాకా వదలట్లేరు. ఉదాహరణకు ఓ సినిమా జంటను తీసుకుంటే.. హీరో ఒక అమ్మాయితో కనిపించారంటే.. అంతే సంగతులు. వారిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా అంటకట్టేస్తారు. పోనీ, అక్కడితో ఆపుతారా అంటే అదీ లేదు. ఎలా పరిచయం..? జంటగా ఎక్కడెక్కడికి వెళ్లారు..? డేటింగ్‌తో ఆపేస్తారా..? బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారా..? ఇలా ఎన్నో రూమర్లు. అచ్చం ఇదే తరహా ఇబ్బందులు ఓ క్రికెట్ జంటకు ఇబ్బందులు ఎదురయ్యాయట. ఎక్కడికి వెళ్లినా మనశ్శాంతి లేకుండా పోయిందట. 

పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్, అతని భార్య షానియేరా పదేళ్లుగా సంతోషంగా ఉన్నారు. అప్పుడప్పుడు వారి బంధంలో చిన్న చిన్న కలతలు వచ్చినా.. అవి ఆ నాలుగు గోడలకు పరిమితం. అటువంటిది ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. అక్రమ్ మరొకరిని చూసుకున్నారని.. ఆ విషయం తెలిసి షానియేరా అతనికి గుడ్ బై చెప్పిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ కథనాలు పుణ్యమా అని ఆమెను ఎంతో మంది దీనిపై ప్రశ్నించారట. అది చాలదన్నట్లు  ఓ సోషల్ మీడియా యూజర్.. ఆ విషయాన్ని మరింత పెద్దది చేశారు. 

భార్యలతో తెగదెంపులు తీసుకున్న క్రికెటర్లు వీరే.. అని 11 మందిని క్రికెట్ జట్టులా తయారు చేసి నెట్టింట పోస్ట్ చేశారు. అందులో మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, అజారుద్దీన్ నుండి మొదలు పెడితే.. మొన్నటి హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ వరకు అన్నీ ఫేమస్ ముఖాలే ఉన్నాయి. ఆ ఫోటో కాస్త అక్రమ్ భార్య చెంతకు చేరడంతో.. ఆమె ఫైర్ అయ్యారు.

ఇతరులు సంతోషంగా ఓర్వలేరా అని ఆమె సదరు పోస్ట్ పెట్టిన యూజర్‌ను ప్రశ్నించారు. నా భర్త విడాకులిస్తే, నాకు తెలియాలి కదా..! మరి నాకు తెలియకుండా మీకెలా తెలిసింది. అంటే విడాకులు మీకిచ్చారా..? అని సదరు యూజర్‌‌పై ఆ దేశ మీడియా ముందు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు, నిజానిజాలేంటో తెలుసుకోకుండా అవాస్తవాలు పోస్ట్ చేసిన సదరు యూజర్ తీరును ఎక్స్(X)లోనూ ఎండగట్టారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.