- 500 మందికి ఒక్కరే !
- సిటీలో చెత్త సాఫ్ చేసేందుకు శానిటేషన్ సిబ్బంది కొరత
- కాలనీలు, బస్తీల్లో ఎక్కడిది అక్కడ్నే
- కంప్లయింట్స్ చేస్తున్నా పట్టించుకోని అధికారులు
- ఉన్నవాళ్ల మీదనే పని భారం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ జనాభా దాదాపు కోటి 25 లక్షలు. సిటీని క్లీన్ గా ఉంచే కార్మికులు దాదాపు 25 వేలు. 500 మంది సిటిజన్స్‌కు ఒక్క శానిటేషన్ కార్మికుడే. ఇంత తక్కువగా ఉంటే సిటీ క్లీన్ గా ఉండేదెలా ? క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం. స్వచ్ఛతలో బెస్ట్ర్యాంకు సాధిస్తామని అధికారులు చెబుతారు. కానీ మ్యాన్ పవర్ ను మాత్రం పెంచడం లేదు. పైగా ఉన్న వారిని తగ్గిస్తున్నారు. కావాల్సినంత మంది లేక రోడ్ల పై చెత్త ఎక్కడిదక్కడే ఉంటోంది. చెత్త కుండీల వద్ద భారీగా పేరుకుపోతుంది. అయినా శానిటేషన్ కార్మికులను పెంపుపై బల్దియా ఫోకస్ చేయడం లేదు.
50 లక్షల జనాభా ఉన్నప్పుడు..
హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్ గా ఉన్నప్పుడు 50 లక్షల జనాభాకు రోడ్లు, కాలనీలను క్లీన్ చేసేందుకు 25 వేల మంది పర్మినెంట్, 7 వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు ఉండేవారు. ఇప్పుడు జనాభా కోటి దాటింది. కార్మికుల సంఖ్య 70 వేల వరకైనా ఉండాలి. కానీ ఉన్నది 20 వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు. మరో 5 వేల మంది పర్మినెంట్ సిబ్బంది. జీహెచ్ఎంసీ గా మారిన తర్వాత కార్మికుల సంఖ్యను పెంచాల్సిందిపోయి తగ్గిస్తున్నారు.
ఎక్కువైన పనిభారం
ఏరియా పెద్దగా ఉండడంతో క్లీన్ చేసేందుకు టైమ్ సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మెయిన్ రోడ్లను, ఆ తర్వాత కాలనీల్లో క్లీన్ చేస్తున్నామంటున్నారు. 10 మంది చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారంటున్నారు. పని భారం ఎక్కువైందని పేర్కొంటున్నారు. ఒక్కో రోజు టైమ్ సరిపోక కొన్ని కాలనీల్లో క్లీన్ చేయలేకపోతుంటే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారే తప్ప సమస్య పై ఫోకస్ పెట్టడం లేదంటున్నారు. 2,500 స్వచ్ఛ ఆటోల్లోనూ ఇప్పుడు పని చేస్తున్నవి500 మాత్రమే. ఇంకొన్ని ఆటోలు కొంటామని లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ వాళ్లకు ఆటోలను ఇప్పటికీ ఇస్తలేరు.
వీఐపీ ఏరియాల్లోనే ఫోకస్
వీఐపీ ఏరియాల్లోనే బల్దియా ఫోకస్ చేస్తున్నది. నేతలు, పెద్ద ఆఫీసర్లు ఉండే ప్రాంతాల్లో క్లీన్‌గా ఉంచాలని కింది స్థాయి సిబ్బందికి అధికారులు చెప్తున్నారు. మిగతా ఏరియాల్లో శానిటేషన్‌ను పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీకి వస్తున్న కంప్లయింట్లలో ఎక్కువగా శానిటేషన్ కి సంబంధించినవే ఉంటున్నాయి. గత 50 రోజుల్లో శానిటేషన్ సరిగా లేదని 8 వేల కంప్లయింట్స్వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యాప్, వెబ్ సైట్ట్లలో ఫొటోలు తీసి కంప్లయింట్ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఖర్చు భారీగా పెరిగిన లాభం లేదు
చెత్త రవాణకు గతంతో పోలిస్తే ప్రస్తుతం జీహెచ్ఎంసీ భారీగా ఖర్చు పెంచింది. 2016 వరకు ఏడాదికి రూ.160 కోట్లతో చెత్త తరలింపు జరిగేది. తర్వాత ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తూ ఏటా రూ. 660 కోట్లు ఖర్చు పెడుతుంది. గతంలో సొంతంగా 800 ల గార్బేజ్వెహికల్స్ ఉండేవి. వీటి ద్వారా గ్రేటర్‌లోని చెత్త ను డంపింగ్‌యార్డులకు తరలించే వారు. సర్వీసు 15 ఏళ్లు దాటిందని ఇందులో 600 వెహికల్స్‌ను పక్కనపెట్టారు. ప్రస్తుతం 200 వెహికల్స్తోనే చెత్త తరలిస్తున్నారు. ఏడాదికి రూ. 560 కోట్ల ఖర్చు పెరిగినప్పటికీ చెత్త ప్రాబ్లమ్ కూడా పెరిగింది. స్వచ్ఛ ఆటో ద్వారా డైలీ చెత్త సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది లేక ఇంటింటి నుంచి నుంచి చెత్త సేకరించడం లేదు. ఖర్చు పెంచినా అవసరమైన సిబ్బందిని మాత్రం పెంచలేదు.
నెలరోజులైనా క్లీన్ చేస్తలే
నెల రోజులుగా చెత్తను క్లీన్ చేయడం లేదు. ఇండ్ల మధ్యలో చెత్త ఉండగా కంపు వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్లాలి. రోడ్లను, డ్రైనేజీలను క్లీన్ గా ఉంచేలా చూడాలి.
-విజయలక్ష్మి, గుడి మల్కాపూర్
రోడ్ల మీదే చెత్త పోస్తున్నరు
ఇండ్లలో చెత్తను తీసుకుపోయేందుకు ఆటోలు వస్తలే. అందరు చెత్తను తెచ్చి రోడ్డుపై వేస్తున్నారు . చెత్త కుప్పలు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నం.
– హరిస్వామి, టోలిచౌకి
కార్మికుల సంఖ్య పెంచాలె
జనాభాకు సరిపడా కార్మికులు లేనప్పుడు సిటీ క్లీన్ గా ఎలా ఉంటది? దేశంలోని ఇతర నగరాల్లో పారిశుద్ద్య కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంది. కానీ ఇక్కడ 25 వేల మంది మాత్రమే ఉన్నారు. కోటి 20 లక్షల మందికి దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఉండాలి. తక్కువ మంది ఉండటంతో పనిభారం ఎక్కువై రోగాల బారిన పడుతున్నారు. వెంటనే కార్మికుల సంఖ్యను పెంచాలె.
– ఊదరి గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్
For More News..