
కౌడిపల్లి, వెలుగు : మన ఊరు మన బడి కింద లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపడుతున్నా అవి పూర్తికాక ఎలాంటి ఫాయిదా ఉండటం లేదని నాగసాన్ పల్లి, రాజిపేట సర్పంచులు ఎల్లం, లింగం గౌడ్ మండిపడ్డారు. కౌడిపల్లి మండల పరిషత్ జనరల్‌బాడీ మీటింగ్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ అవసరం ఉన్న చోట పనులు చేయకుండా, అవసరం లేని పనులు చేస్తూ డబ్బులు వృథా చేస్తున్నారన్నారు.
శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంఈఓ బుచ్చా నాయక్ ను నిలదీశారు. పలు స్కూళ్లలో వర్షానికి నీరు చేరితే ఇప్పటికీ ఏ ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదన్నారు. స్టూడెంట్స్‌కు ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. మండల కేంద్రంలో పల్లె దవాఖానా నిర్మించిన ఎందుకు తెరవడం లేదని ఎంపీపీ రాజు డాక్టర్ ఫిర్నాస్ బేగంను నిలదీశారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ లో లక్షలు పెట్టి బడి నిర్మిస్తే ప్రైవేటు భూమి అంటూ కేసులు పెడుతున్నారని ఎంపీటీసీ స్వప్న కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.