స్టాక్ హోం: ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతోందని, వివిధ దేశాల వద్ధ ప్రస్తుతం 9 వేలకు పైగా న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయని అంతర్జాతీయ సంస్థ తెలిపింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సిప్రి) తన ఇయర్ బుక్లో ఈ విషయం వెల్లడించింది. అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని వివరించింది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల వద్ద 12,121 అణ్వాయుధాలు ఉండగా.. వాటిలో 9,585 వెపన్స్ ప్రయోగానికి రెడీగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 2,100 ఆయుధాలు హై అలర్ట్ కేటగిరిలో వెనువెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునికీకరిస్తున్నాయని తెలిపింది.
తప్పిన నియంత్రణ..
ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో అణ్వాయుధ ప్రయోగ ముప్పు పెరిగిందని సిప్రి ఆందోళన వ్యక్తం చేసింది. పైగా అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించిన ఒప్పందం నుంచి రష్యా సహా పలు దేశాలు బయటకు వచ్చాయని గుర్తుచేసింది.ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో న్యూక్లియర్ అగ్రిమెంట్ ను పొడిగించేందుకు రష్యా అంగీకరించలేదని పేర్కొంది. అయితే, అణ్వాయుధ ప్రయోగం వల్ల కనీవినీ ఎరుగని విధ్వంసం తప్పదనే విషయం దేశాధినేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.
అగ్రరాజ్యాల వద్దే 90 శాతం..
ప్రపంచంలో ఇప్పుడున్న అణ్వాయుధాలలో 90 శాతం రష్యా, అమెరికాల దగ్గరే ఉన్నాయని సిప్రి తన నివేదికలో పేర్కొంది. చైనా కూడా తన దగ్గరున్న అణ్వాయుధాలలో కొన్నింటిని వెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండేలా మెయింటెన్ చేస్తోందని తెలిపింది. కోల్డ్ వార్ తర్వాత అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ రాగా.. ఇటీవలి కాలంలో ఏటేటా వాటి సంఖ్యను ఆయా దేశాలు పెంచుకుంటున్నాయని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని సిప్రి డైరెక్టర్ డేన్ స్మిత్ చెప్పారు.
అత్యంత గడ్డుకాలం: సిప్రి డైరెక్టర్
మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పీరియడ్లలో ప్రస్తుతం నడుస్తున్న కాలం కూడా ఒకటని సిప్రి డైరెక్టర్ విల్ ఫ్రెడ్ వాన్ ఆందోళన వ్యక్తంచేశారు. కోల్డ్ వార్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాలలో న్యూక్లియర్ వెపన్స్ అత్యంత కీలక పాత్ర పోషించడం చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు.