శంషాబాద్, వెలుగు: ఐదేండ్ల చిన్నారిపై వాచ్ మన్ లైంగికదాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓ కానిస్టేబుల్ కుటుంబం స్థానికంగా అపార్ట్ మెంట్ మూడో అంతస్తులో అద్దెకు ఉంటోంది. అదే బిల్డింగ్ కింద అంతస్తులో ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బుద్ధిబండకు చెందిన ఆంజనేయులు (35) వాచ్ మన్ గా చేస్తున్నాడు. అతడిని భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు.
సోమవారం కానిస్టేబుల్దంపతులు ఇంట్లో లేనప్పుడు చిన్నారిని కిందకు పిలిచి ఆంజనేయులు లైంగికదాడికి పాల్పడ్డాడు. పాపకు తీవ్ర రక్తస్రావమై కేకలు వేయడంతో అరుపులు విని స్థానికులు వచ్చి చూడగా ఏడుస్తుంది. చిన్నారి పరిస్థితిని చూసి ఆగ్రహంతో స్థానికులు నిందితుడు ఆంజనేయులను బంధించి చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్, ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపారు.