స్కూల్స్‌లో ఇంటర్వల్ బెల్, లంచ్ బెల్, హోల్ బెల్ కొడతారు. వీటికితోడు ఇప్పుడు కొన్ని చోట్ల వాటర్ బెల్ కూడా మోగిస్తున్నారు. స్టూడెంట్స్ మర్చిపోకుండా మంచినీళ్లు తాగేలా చేయటం, తద్వారా వాళ్లు హెల్దీగా ఉండేలా చూడటం దీని లక్ష్యం. కేరళ, కర్ణాటక బడుల్లో అమలుచేస్తున్న ఈ సరికొత్త ఆలోచనను అన్ని వర్గాలు ‘శభాష్’ అంటున్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అలాగే టాయిలెట్స్ కూడా సరిపోను కట్టించి క్లీన్‌గా ఉంచితే ఆడ పిల్లలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.
దేశంలోని దాదాపు అన్ని స్కూల్స్‌లో ప్రస్తుతం టాయిలెట్స్ ఉంటున్నాయి. కాకపోతే పిల్లల సంఖ్యకు తగ్గట్లు ఉండట్లేదు. ఒక వేళ ఉన్నా వాటిని శుభ్రంగా మెయిన్‌టెయిన్ చేయట్లేదు. దీంతో ఆడపిల్లలు యూరిన్‌కి వెళ్లలేకపోతున్నారు. వాటర్ తాగితే ఇంకా ఇబ్బందని భయపడుతున్నారు. ఫలితంగా వాళ్లకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి కేరళ, కర్ణాటకల్లోని కొన్ని స్కూల్స్‌లో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదే.. ‘వాటర్ బెల్’.
ఈ స్పెషల్ బెల్ని రోజూ మూడు సార్లు మోగిస్తారు. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు రెండోసారి, ఆ తర్వాత 2 గంటలకు మూడోసారి ఈ గంట కొడతారు. మార్నింగ్ ఇంటర్వల్ బెల్కి, ఆఫ్టర్నూన్ లంచ్ బెల్కి, మళ్లీ ఈవెనింగ్ ఇంటర్వల్ బెల్కి అర్ధ గంట ముందు 5 నిమిషాల పాటు ‘వాటర్ బెల్’ ప్రోగ్రామ్ అమలుచేస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు తప్పనిసరిగా మంచినీళ్లు తాగాలి. ఎంత తాగాలనేది వాళ్లిష్టం. మినిమం ఇంత అనే రూలేం లేదు.
కొత్త కాన్సెప్ట్ పుట్టిందిలా..
‘స్టూడెంట్స్ రోజూ ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు గొంతు పట్టేస్తే తప్ప మంచి నీళ్లు తాగట్లేదు. మిగతా సమయాల్లోనూ ఆటపాటల్లో పడి మర్చిపోతున్నారు. తెచ్చిన బాటిల్స్‌ని తెచ్చినట్లే వెనక్కి తీసుకెళుతున్నారు. దీంతో ఈమధ్య కాలంలో బడి పిల్లల కిడ్నీల్లో రాళ్లు తదితర హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నట్లు గుర్తించాం. దీనిపై ఇటీవల ఓ మీటింగ్‌లో టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో చర్చించి వాటర్ బెల్ కాన్సెప్ట్‌ని ముందుకు తెచ్చాం’ అని ఒక స్కూల్ ప్రిన్సిపల్ వివరించారు. ఐక్యరాజ్యసమితి గైడ్‌లైన్స్ ప్రకారం స్కూల్స్‌లోని స్టూడెంట్లందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందేలా చూడాలి. అది వారి హక్కు. చాలా బడుల్లో మంచినీళ్లు ఉంటున్నాయి. కానీ.. వాటిని పిల్లలు చాలినంత తాగుతున్నారా? లేదా? అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు. దీనికోసం ఓ వ్యవస్థ అంటూ లేకుండాపోతోంది. దీన్ని సరిచేయటానికి కేరళలో తొలుత ఒకటీ రెండు చోట్ల ప్రారంభమైన ఈ వాటర్ బెల్ ప్రోగ్రామ్ క్రమంగా అన్ని స్కూల్స్‌కీ విస్తరిస్తోంది. మంచి నీళ్లు తాగటం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో గుర్తిస్తున్నారు.
పెరుగుతున్న యూరిన్ ఇన్ఫెక్షన్ బాధితులు
నీళ్లు తాగక పిల్లలు నీరసించిపోతున్నారు. అదే పనిగా ఎండలో ఆడుకుంటూ ఉండటంతో ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతోంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారు. అది చివరకు జ్వరానికి దారితీస్తోంది. ప్రపంచంలో పీడియాట్రిక్ యూరోలిథియాసిస్ సమస్యతో బాధపడుతున్న బడి పిల్లల సంఖ్య గడచిన కొన్నేళ్లుగా పెరుగుతోంది. స్కూల్లో క్రమం తప్పకుండా వాటర్ తాగటాన్ని అలవాటు చేయటమే దీనికి పరిష్కారం. బడిలో అలవాటైతే ఇంటికి వెళ్లాక కూడా మర్చిపోకుండా మంచి నీళ్లు తాగే అవకాశం ఉంది.
‘యూరిన్ సంబంధ ఆరోగ్య సమస్యలతో ప్రతి పీడియాట్రీసియన్ని కలుస్తున్న స్కూల్ చిల్డ్రన్ సంఖ్య రోజూ యావరేజ్‌గా ఒకటి నమోదవుతోంది. ఈ ఇన్ఫెక్షన్తో ఇబ్బందిపడుతున్న పిల్లలను పేరెంట్స్ ఔట్ పేషెంట్ వార్డుకు తీసుకొస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆడపిల్లలే. స్కూల్లో సరిగా మంచినీళ్లు తాగట్లేదా అని డాక్టర్ అడిగితే అవునంటున్నారు. టాయిలెట్‌కి వెళ్లటం తప్పుతుందనే ఉద్దేశంతో అలా చేస్తున్నామని చెబుతున్నారు’ అని ‘ఇండియన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్’(ఐఏపీ) మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.సచ్చిదానంద కామత్ అన్నారు.
నీళ్లు ఎక్కువ తాగాలి
పిల్లలు, టీనేజర్లు రోజూ కనీసం లీటర్‌న్నర నుంచి మూడు లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలి. జెండర్, వయసు, బరువును బట్టి ఈ క్వాంటిటీ మారుతుంది. ఒంట్లో నీరు కొద్దిగా తగ్గితే (మైల్డ్ డీహైడ్రేషన్) తలనొప్పి, ఆయాసం వస్తుంది. ఓపిక ఉండదు. పదే పదే చిరాకు పడతారు. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. పాఠాలు నేర్చుకోవటం కష్టంగా మారుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గటం వల్ల వచ్చే ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీలు, లివర్, మెదడు పాడవుతాయి. మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉంది.
వాటర్‌తో వంద లాభాలు
ఖర్చులేని, కొవ్వు పెరగని లిక్విడ్ మంచి నీళ్లే. వాటర్ తాగితే బాడీలో హైడ్రేషన్ స్టేటస్ మెరుగుపడుతుంది. స్కూల్ స్టూడెంట్స్ ఫీల్ బెటర్‌గా తయారవుతారు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అకడమిక్‌గా మంచి పెర్ఫార్మెన్స్ చూపుతారు. వాటర్ బాగా తాగే బడి పిల్లలతో పోల్చితే తాగనివాళ్లు రెట్టింపు క్యాలరీల శక్తిని కోల్పోతారని ఇంటర్నేషనల్ స్టడీస్ చెబుతున్నాయి. మంచి నీళ్లకు బదులు షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగితే ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ సమస్య చుట్టుముడుతుంది. ఈ నేపథ్యంలో ‘వాటర్ బెల్’ ఇనీషియేటివ్ దేశమంతా విస్తరించాలి.