- కర్నూలు స్కూల్‌లో రోజూ రెండుసార్లు వాటర్ బెల్
- ఆరోగ్యం కోసం వాటర్ బెల్: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు: ప్రభుత్వం స్కూళ్లలో ప్రత్యేకంగా వాటర్ బెట్! ఒత్తిడితో మంచి నీళ్లు తాగక పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చేపడుతున్న వినూత్న కార్యక్రమం ఇది. కేరళలో ప్రారంభించిన ఈ విధానం చూసి ఆకర్షితుడైన ఏపీలోని కర్నూలు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనూ స్టార్ట్ చేశారు.
‘మన కర్నూలు – మన బాధ్యత’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆరోగ్య సూత్రాలలో భాగంగా స్కూల్ విద్యార్థులకు క్లాసుల మధ్యలో వాటర్ బెల్ ఉండాలని తాను భావించానని ఆయన చెప్పారు. దీన్ని మొదటగా తన నియోజకవర్గలోని కర్నూలు టౌన్ అరబిక్ స్కూల్‌లో ప్రారంభించాలని నిర్ణయించానన్నారు. దీనికి కలెక్టర్ వీరపాండియన్ సాయం కోరి, ఆయన చేతుల మీదే ప్రారంభింపజేస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్‌ను, పుస్తకాలను ఉచితంగా అందజేశారు ఎమ్మెల్యే. పాఠశాలలో ప్రతి రోజు రెండు సార్లు వాటర్ బెల్ ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విస్తరించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. సీఎం జగన్ ప్రారంభించిన ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తాను చేపట్టానన్నారాయన. వాటర్ బెల్ విధానానికి శ్రీకారం చుట్టినందుకు ఎమ్మెల్యేని అభినందించారు కలెక్టర్ వీరపాండియన్. నగరంలో ప్రారంభమైన వాటర్ బెల్ కార్యక్రమం జిల్లా అంతటా అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.