
- సరిపడా నీళ్లు తాగక పిల్లల్లో అనారోగ్య సమస్యలు
- సిటీలో 36 డిగ్రీలకు చేరిన ఎండలు
- మార్చి, ఏప్రిల్ నాటికి 48 డిగ్రీలకు చేరే చాన్స్
- స్కూళ్లలో మూడుసార్లు వాటర్ బెల్ మోగించాలంటున్న పేరెంట్స్
- కేరళ, ఏపీల్లో కొనసాగుతున్న విధానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎండాకాలం మొదలైన నేపథ్యంలో స్కూళ్లలో వాటర్ బెల్ మోగించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరుకున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నాటికి ఇవి 48 డిగ్రీలకు చేరువయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, స్కూళ్లకు వెళ్లే పిల్లలు చదువు, ఆటల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతున్నారని, తగినన్ని నీళ్లు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారని పేరెంట్స్ వాపోతున్నారు.
అందుకని ఎండాలకాలం ముగిసే వరకు స్కూళ్లలో ప్రత్యేకంగా వాటర్ బెల్స్ పెడితే ప్రయోజనం ఉంటుందంటున్నారు. 2019 నుంచి కేరళ రాష్ట్రంలో ప్రతి ఎండాకాలంలో వాటర్ బెల్ మోగిస్తున్నారు. ఈ ప్రక్రియ అక్కడ సత్ఫలితాలిస్తున్నది. పక్క రాష్ట్రమైన ఏపీలోనూ గతేడాది నుంచి వాటర్ బెల్ ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో ఈ ఏడాదైనా వాటర్ బెల్ అమలు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.
మూడు లీటర్లు తప్పనిసరి
పిల్లలు, టీనేజర్లు కనీసం రోజుకు 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జెండర్, వయసు, బరువును బట్టి ఈ క్వాంటిటీ మారుతుందంటున్నారు. ‘ఒంట్లో నీటి శాతం తగ్గితే (మైల్డ్ డీహైడ్రేషన్) తలనొప్పి, ఆయాసం వస్తాయి. ఓపిక ఉండదు. పదే పదే చిరాకు పడతారు. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. పాఠాలు నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టలేరు.
బాడీకి కావాల్సిన నీళ్లు తాగడం వల్ల బాడీలో హైడ్రేషన్ స్టేటస్ మెరుగుపడుతుంది. యాక్టివ్ గా ఉంటారు. బాగా నీళ్లు తాగే బడి పిల్లలతో పోల్చితే తాగనివాళ్లు రెట్టింపు క్యాలరీల శక్తిని కోల్పోతారు’ అని ఇంటర్నేషనల్ స్టడీస్ చెబుతున్నాయి. అందుకని ఎండాకాలం సెలవులు ఇచ్చేంతవరకు స్కూల్స్‌లో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ మోగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉదయం10 గంటల 35 నిమిషాలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు మూడోసారి బెల్కొట్టాలని కోరుతున్నారు.
చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలు
చాలా మంది పిల్లలు స్కూల్స్‌కు ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తారు. కానీ, లంచ్ టైంలో మాత్రమే ఆ నీళ్లను తాగుతున్నారు. లంచ్ కు ముందు కాని, ఆ తర్వాత కానీ తాగడం లేదని టీచర్లు, పేరెంట్స్ చెప్తున్నారు. పిల్లలు ఆటలు ఆడినప్పుడు వారి ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. మళ్లీ నీటిని తాగకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. అది చివరకు జ్వరానికి దారితీస్తోంది.
సరైనన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్లు చేరి పీడియాట్రిక్ యూరోలిథియాసిస్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న బడి పిల్లల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగిపోతోంది. ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల వచ్చే ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీలు, లివర్, మెదడు పాడవుతాయి. మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కూల్లో క్రమం తప్పకుండా నీళ్లను తాగటాన్ని అలవాటు చేయడమే దీనికి పరిష్కారమని డాక్టర్లు సూచిస్తున్నారు. బడిలో నీళ్లు తాగడం అలవాటైతే ఇంటికి వెళ్లాక కూడా ఈ అలవాటు కొనసాగుతుందని అంటున్నారు.
కనీసం 2 లీటర్లయినా తాగాలి
ఎనిదేండ్ల పైబడిన పిల్లలు రోజుకు కనీసం 2 లీటర్లు, ఆరేండ్ల పైబడినవారు 1.5 లీటర్లు తప్పకుండా తాగాలి. ఎండాకాలంలో ఇంకొంచెం ఎక్కువ తాగినా మంచిదే. పిల్లలు చదువు, ఆటల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల హీట్ స్ట్రోక్, కడుపులో మంట, మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయి. నీళ్లు సరిపడా తాగితే... ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరవు.
డాక్టర్ చేతన్ ఆర్ ముండాడ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్