నీళ్లు వేస్ట్ చేస్తే చెప్పండి.. నజరానా పొందండి.. హైదరాబాద్ జనానికి వాటర్ ​బోర్డ్​ బంపర్ ఆఫర్

నీళ్లు వేస్ట్ చేస్తే చెప్పండి.. నజరానా పొందండి.. హైదరాబాద్ జనానికి వాటర్ ​బోర్డ్​ బంపర్ ఆఫర్
  • నీటి వృథా, అక్రమ కనెక్షన్లపై ఫోకస్
  • త్వరలో అందుబాటులోకి సేవ్​ వాటర్’ యాప్​
  • స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని పిలుపు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో నీటి వృథాతో పాటు అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి సమాచారం ఇవ్వండంటూ వాటర్​బోర్డు జనాలకు ఓ ఆఫర్​ప్రకటించింది. దీని కోసం ‘సేవ్​ వాటర్​’ యాప్​ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ యాప్​నుంచే ఫిర్యాదులు చేయాలని సూచిస్తోంది. దీనికి సంబంధించి సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. 

వాటర్​బోర్డు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి ఎంతో దూరం నుంచి నీటిని తీసుకువస్తుండగా చాలామంది వృథా చేస్తున్నారు. కొందరు వాహనాలు కడుక్కోవడానికి, మరికొందరు ఇంటి ముందు, పైన చల్లగా ఉంటుందని వృథా చేస్తున్నారు. మెజారిటీ కనెక్షన్​దారులైతే నల్లాలకు మీటర్లు పెట్టి గుంజుకుపోతున్నారు. దీనికి చెక్​పెట్టేందుకు కొత్త ఆలోచన చేసింది.

నీటి వృథా, అక్రమ కనెక్షన్లపై ప్రజలే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా ‘సేవ్​ వాటర్​’ యాప్ ను రూపొందించింది. ఎవరైనా ఈ యాప్​డౌన్​లోడ్​ చేసుకుని వారి ఫోన్​ కెమెరాతో ఫొటోలు తీసి షేర్​ చేస్తే సరిపోతుంది. మిగిలిన పని అధికారులు చూసుకుంటారు. 

అలాగే సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. 1.40 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ లో 13.80లక్షల కనెక్షన్​దారులు ఉండగా..ప్రతి రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చాలా టైం పడుతోంది. దీంతో  దేశంలో ఎక్కడా లేని విధంగా సేవ్​ వాటర్​యాప్​ను తీసుకువచ్చి నీటి వృథాను అరికట్టే ప్లాన్​చేసింది.  

వలంటీర్లుగా పని చేయండి..
నీటి వృథాపై వాటర్​బోర్డుకు సమాచారం ఇవ్వడానికి కనీసం ఐదు వేల మంది వలంటీర్లుగా వస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. ప్రజలతో పాటు వలంటీర్లు కూడా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. వీరికి కూడా ప్రోత్సహకాలు ఇచ్చి ఎంకరేజ్​ చేయాలని భావిస్తున్నారు.