బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలిన ఘటనపై బుధవారం చేసిన ఆరోపణలకు జలమండలి వివరణ ఇచ్చింది. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర జలమండలి స్పష్టం చేసింది. ఈమేరకు నవంబర్ 6న జలమండలి అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టిన మెగా కంపెనీని ఇప్పటివరకు ఎందకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించగా.. గోడ కూలిన ఘటనపై కమిటీ నివేదిక సమర్పించిందని పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టర్‌కు నోటీసులు కూడా జారీ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిందని వాటర్ బోర్డ్ తెలిపింది.
కాంట్రాక్టర్ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేదని జలమండలి అధికారులు చెప్పారు. కమిటీ సాంకేతిక నిపుణుల ద్వారా సమగ్ర విచారణకు సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలమేరకు రాష్ట్ర విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్.. ఇదే ఘటన మీద విచారణ చేపట్టింది. విచారణ పూర్తి అయిన తర్వాత.. సమర్పించే నివేదిక ఆధారంగా కాంట్రక్టర్ పై తదుపరి చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు వివరించారు.
ALSO READ : మేఘా కంపెనీ పాపంలో మీ వాటా ఎంత కేటీఆర్:ఎంపీ వంశీ గడ్డం
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునరుజ్జీవానికి.. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం గోదావరి ఫేజ్-2 పథకం రూపకల్పన చేసిందని వాటర్ బోర్డు అధికారులు ప్రెస్ నోట్ లో స్పష్టం చేశారు.
జంట జలాశయాల్లోకి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి గోదావరి ఫేజ్-2 పథకం రూపకల్పన చేస్తున్నామన్నారు. కానీ.. కొండ పోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల సరఫరాకు రూ.1100 కోట్లు అంచనా వ్యయం రూపొందించలేదని జలమండలి అధికారులు వివరించారు.