- సిటీలోని రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో..రాత్రింబవళ్లు పనిచేసిన ఉద్యోగులు
- అభినందించిన ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పండగ సమయాల్లోనూ జలమండలి ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. సంక్రాంతి సమయంలో అందరూ సంతోషంలో మునిగిపోతే వీరు మాత్రం పనిలో నిమగ్నమయ్యారు. సిటీలో తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించారు. కేపీహెచ్బీ, అమీర్పేట్, పంజాగుట్ట, మూసాపేట, బంజారాహిల్స్, జగద్గిరిగుట్ట, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ లీకేజీలు, సీవరేజ్, ఇతర సమస్యలను పరిష్కరించడానికి రాత్రి పగలు తేడా లేకుండా పని చేశారు. అవసరమైన చోట్ల పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ట్రాన్స్ కో, టీజీఎన్పీడీసీఎల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నారు.
ఈ పనులన్నింటినీ సంబంధిత సర్కిళ్ల జీఎంలు, సెక్షన్ల మేనేజర్లు పరిశీలించారు. ఈ సమయంలో సిటీలోని రోడ్లు ఖాళీగా ఉండడంతో.. వాటిపై ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇదే మంచి సరైన సమయమని భావించి మరమ్మతులు చేపట్టారు. సాధారణ సమయంలో ఇలాంటి పనులు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశముండటంతో ఇప్పుడు వాటిని చేపట్టారు. పండగ సమయాల్లోనూ పని చేసిన జలమండలి సిబ్బంది, అధికారులను ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మాయాంక్ మిట్టల్ అభినందించారు. .