తాగునీరు,డ్రైనేజీ సిస్టమ్​.. ఔటర్ దాకా సిటీ శివారు ప్రాంతాలపై వాటర్ బోర్డు నజర్ 

  • తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి కసరత్తు  
  • బడ్జెట్​లో పెట్టిన నిధులతో అభివృద్ధి పనులకు ప్లాన్ రెడీ
  • ఫేజ్ –2 ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తికి అధికారుల చర్యలు
  • 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు, 24 పంచాయతీలకు లబ్ధి

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీ విస్తరిస్తుండగా ఔటర్ పరిధిలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణాలపై వాటర్​బోర్డు దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను మాత్రమే  తీరుస్తుండగా.. త్వరలోనే పూర్తిస్థాయిలో నీటి సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సిటీలో ఉన్నట్టుగానే డ్రైనేజీ, తాగునీటి పైప్​లైన్లు, రిజర్వాయర్లు, సీవరేజీ ట్రీట్​మెంట్​ప్లాంట్ల వంటి నిర్మాణాలపై ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేశారు. గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరాకు వాటర్ బోర్డు చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్–1 ఇప్పటికే పూర్తి చేశారు.

త్వరలోనే ఫేజ్​–2ను కూడా కంప్లీట్ కానుంది. ఇవి పూర్తయితే  ఆయా ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ప్యాకేజీలుగా నిర్మిస్తున్న 38 రిజర్వాయర్లలో ఇప్పటికే 13 పూర్తయి అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.  మిగిలిన 25 నిర్మాణ పనులు సైతం 90 శాతం కాగా.. త్వరగా కంప్లీట్ చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కొత్తగా 1,250 కిలో మీటర్ల మేర కొత్త పైపు లైన్ నిర్మాణం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించిన రూ. 4,085 కోట్ల నిధుల్లో కొంత ఓఆర్ఆర్​ పరిధిలోని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని కూడా అధికారులు నిర్ణయించారు.

 వాటర్ ఫేజ్–2 ​ప్రాజెక్ట్​ త్వరలో పూర్తి

ఔటర్ వాటర్ ఫేజ్–-2 ప్రాజెక్టును రూ.1200 కోట్లతో చేపట్టగా.. కొత్తగా 73 సర్వీసు రిజర్వాయర్లు (138 మిలియన్ లీటర్ల సామర్థ్యం), 2,988 కిలో మీటర్ల మేర కొత్త పైపు లైన్ నెట్ వర్క్ ను నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. అదేవిధంగా 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలు లబ్ధిపొందుతాయి.

సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్, కీసర (7 మండలాలు) ప్రాంతాల్లో 4.36 లక్షల మందికి,  రాజేంద్రనగర్, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం ఏరియాల్లో 1.96 లక్షల మందికి నీటి సరఫరా అందుతుంది.  

సీవరేజ్ మాస్టర్ ప్లాన్ లో నిర్మాణం 

 ఔటర్పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కూడా అండర్​గ్రౌండ్​డ్రైనేజీ నిర్మాణానికి వాటర్​బోర్డు ప్లాన్ రెడీ చేస్తోంది. త్వరలో బోర్డు అమలు చేయబోయే సీవరేజ్​మాస్టర్​ప్లాన్​లో భాగంగా ఆయా ప్రాంతాల్లోనూ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు నిధులను ఏ విధంగా సేకరించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. సీవరేజ్ వ్యవస్థతో పాటు  ట్రీట్ మెంట్ ప్లాంట్ కు కూడా ప్లాన్ రూపొందించారు.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,849.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో  39 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఔటర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే మురుగునీరు మూసీ లోకి వెళ్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్మించబోయే ఎస్టీపీలతో ఆయా ప్రాంతాల్లోని మురుగునీరంతా శుద్ధి జరగనుందని  వాటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.