
- ఫ్రీ వాటర్ స్కీమ్ పై వాటర్ బోర్డుకు నో క్లారిటీ
- ఢిల్లీలో అమలుకు మూడేళ్ల ముందే కసరత్తు
- ఫీల్డ్ లెవల్ రిపోర్టులతో యాక్షన్‌ప్లాన్ అమలు
- టెక్నాలజీ సాయంతో లీకేజీల గుర్తింపు
- మన వద్ద నిజాం కాలం నాటి పైప్‌లైన్ వ్యవస్థనే..
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఫ్రీ వాటర్ స్కీమ్ అమలుకు మూడేళ్ల ముందు నుంచే కసరత్తు జరిగింది. నల్లా కనెక్షన్ల నుంచి వాటర్ ట్యాంకర్ల మాఫియా కంట్రోల్‌కు పక్కాగా ప్లాన్ చేసింది. ఫీల్డ్ లెవల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని రిపోర్టులను రూపొందించింది. అక్రమ నల్లా కనెక్షన్, వాటర్ వేస్టేజీ, లీకేజీల కంట్రోల్, ప్రతి ఇంటికి మీటర్ కనెక్షన్ మస్ట్‌గా ఉండే సిస్టమ్‌కు యాక్షన్ ప్లాన్ చేపట్టి దశలవారీగా అమలు చేసింది. 2014లో ఫ్రీ వాటర్ స్కీమ్‌ను స్టార్ట్ చేసింది. పైప్లైన్ల లీకేజీల ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసేందుకు సెన్సర్లను వినియోగించింది.మన వద్ద ఇవేవి లేకుండానే మెప్పు పొందేందుకు వాటర్ బోర్డు ఫ్రీ వాటర్ స్కీమ్ అమలు చేస్తుంది. ఇందులో అనేక లోపాలు ఉండగా, ఇప్పటికీ మీటర్లు లేని కనెక్షన్లపై క్లారిటీ లేదు. ఢిల్లీ తరహా ఫ్రీ వాటర్ సప్లై చేస్తున్నామని ప్రచారం మాత్రమే చేస్తోంది. అందుకు తగినట్లుగా ఫీల్డ్లెవల్లో యాక్షన్ ప్లాన్ ఉందా.. అంటే లేదు. ఫ్రీ వాటర్ కు ఓన్లీ ఆధార్ లింకేజీ, మీటర్ మస్ట్అని సరిపెట్టింది.
భారమైన సబ్సిడీ
2014లో ఢిల్లీ ప్రభుత్వం రూ. 3,724 కోట్లను ఢిల్లీ జల్ బోర్డు స్కీమ్ అమలుకు కేటాయించింది. అయితే ఏటా ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారంగా మారింది. ఇది 2020–21 నాటికి రూ. 467 కోట్లు అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ ఏటా పెరుగుతోన్న ఫ్రీ వాటర్ సబ్సిడీ ప్రభుత్వానికి భారంగా మారిపోయింది. ఇష్టానుసారంగా స్ట్రీమ్ లైన్ తర్వాత 20వేల లీటర్లకు మించిన నీటి వాడకంపై ఢిల్లీ వాటర్ బోర్డు విధించే చార్జీలు అధికమవడంతో దీనిపై సోషల్యాక్టివిస్టులు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో హైదరాబాద్ వాటర్ బోర్డుకు వచ్చే ఆదాయం ఉద్యోగుల శాలరీలకు మాత్రమే సరిపోతుంది. నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం ఏటా బడ్జెట్ లో కేటాయించే నిధులు అప్పులు, వడ్డీలకే జమ అవుతున్న పరిస్థితి మన వద్ద ఉంది.
అక్రమ నల్లా కనెక్షన్లపై యాక్షన్
ఫ్రీ వాటర్ సప్లై అమలుకు ముందుగా ఢిల్లీ సర్కార్వాటర్ మాఫియాపై దృష్టి పెట్టింది. అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్యాంకర్లు, బోర్ వెల్స్, అక్రమ నల్లా కనెక్షన్లపై యాక్షన్ తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 10 లక్షల నల్లా కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసింది. వేస్ట్‌గా పోయే వాన నీటిని ఒడిసిపట్టే ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేస్తుంది. అదే మన సిటీలోనైతే ఏడాది కిందట గుర్తించిన 1.5 లక్షల అక్రమ నల్లా కనెక్షన్లు ఇప్పటిదాకా రెగ్యులరైజ్ చేయలేదు. ఓల్డ్ సిటీలోని చాలా ఇండ్లలో అక్రమంగా నల్లాలు బిగించి, కమర్షియల్ పనులకు వాడుతున్నట్టు వాటర్ బోర్డు సర్వేలో తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి కనెక్షన్లపై ఎలా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలో కూడా అధికారుల్లో స్పష్టత లేదు. దీనిపై వాటర్ బోర్డు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రతి ఇంటికి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మస్ట్‌గా ఉండాలి. వాక్ కమిటీలు ఉన్నా… కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి.
ప్లానింగ్‌తోనే సక్సెస్
ఢిల్లీతో పోల్చితే మన సిటీలో జనాభా తక్కువ. వాటర్ బోర్డు నీళ్ల కంటే బోర్ వాటర్ పై ఆధారపడే ఇండ్లే ఎక్కువ. ఇక నీటి వాడకం చూస్తే కూడా తక్కువే. సిటీలో ఫ్రీ వాటర్ స్కీం పక్కాగా అమలు కావాలంటే ప్లానింగ్ తోనే సాధ్యమని ఎక్స్ పర్ట్స్పేర్కొంటున్నారు. మంత్రులు, సీఎం మెప్పు కోసం స్కీమ్‌ను హడావుడిగా అమలు చేస్తే జనాలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. అంతేకాదు..20వేల లీటర్లు దాటితే బిల్లుల మోత మోగించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.
సెన్సర్లతో లీకేజీల గుర్తింపు
ఇటీవల ఢిల్లీలో కొన్ని ఎన్జీవోలు చేసిన సర్వేల్లోనూ కొన్ని ఏరియాల్లో పొల్యూట్వాటర్ సప్లై అవుతున్నట్టు తేలింది. దీంతో ప్రభుత్వం అలర్టై ఒక్క రోజులోనే సరిచేసే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. లీకేజీలను కూడా తక్షణమే గుర్తించేలా ఆధునిక టెక్నాలజీ వాడుతుంది. సెన్సర్ల ఆధారంగా గుర్తించి రిపేర్లు చేయిస్తుంది. ఇలా వాటర్ సప్లైకి ఢిల్లీ వాటర్ బోర్డు పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. మన సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్ల వ్యవస్థనే ఉంది. వీటి ద్వారానే వాటర్సప్లై అవుతుంది. కలుషిత నీటి సరఫరా కావడం మామూలే. ఓల్డ్ సిటీలోనే కాకుండా కోర్ సిటీలోనూ పొల్యూట్వాటర్ వస్తుంది. దీనిపై స్థానికులు కంప్లయింట్లు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉంది. పైప్లైన్లీకేజీల ప్రాబ్లమ్స్కామన్గా ఉంటాయి.
పైప్‌లైన్ లేని ఏరియాల్లో ట్రీట్ మెంట్ ప్లాంట్లు
ఢిల్లీలో 33.41లక్షల ఇండ్లు ఉండగా, వాటర్ పైపు లైన్ కేవలం 20 లక్షల ఇండ్లకే ఉంది. మిగిలిన 13.41లక్షలకు సప్లై చేసేందుకు ట్యాంకర్లు, బోర్ వెల్స్, కెనాల్స్, చెరువుల నీటిని తీసుకుంటుంది. బస్తీలు, స్లమ్స్, కాలనీల్లో ఫ్రీ వాటర్ పొందాలంటే మీటర్ మస్ట్ చేసింది. ప్రతి ఇంటికి సరఫరా చేసేందుకు 1,250 ఎంజీడీలు అవసరం. దీని కోసం డి సెంట్రలైజ్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పైపులైన్లేని ఏరియాల్లో అండర్ గ్రౌండ్ పైపు లైన్లు, ఆధునిక బూస్టర్లు, ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మన సిటీలో ఇప్పటికీ పైపు లైన్ లేని బస్తీలు వందల సంఖ్యలో ఉన్నాయి. రెండు, మూడు రోజులకోసారి వచ్చే వాటర్ ట్యాంకర్ల కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
For More News..