- ఇప్పటివరకు బల్క్ సరఫరా చేస్తున్న సంస్థ
- తమకూ కనెక్షన్లు కావాలంటూ డిమాండ్
- పైప్‌లైన్ వ్యవస్థ, రిజర్వాయర్ల నిర్మాణానికి కసరత్తు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఔటర్‌రింగ్ రోడ్ పరిధిలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నేరుగా తాగునీటిని సరఫరా చేసేందుకు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. బల్దియా పరిధిని ఓఆర్ఆర్వరకూ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తాగునీటి సరఫరాకు అవసరమైన పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, రిజర్వాయర్లు నిర్మించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్న వాటర్‌బోర్డు..ఓఆర్ఆర్పరిధిలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నీటిని బల్క్‌గా సరఫరా చేస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు ఓఆర్ఆర్చుట్టూ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. విల్లాలు, హైరైజ్భవనాల నిర్మాణం జరుగుతోంది. గ్రేటర్ లో మాదిరిగానే తమకు కూడా నేరుగా కనెక్షన్లు కావాలంటూ ఓఆర్ఆర్పరిధిలోని ప్రాంతాల నుంచి బోర్డుకు పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో వాటర్ లైన్స్, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. అక్కడికి నెట్వర్క్పెంచి కొత్త కనెక్షన్లు ఇస్తే బోర్డుకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలోచిస్తున్నారు.